టీఆర్‌ఎస్‌ ఎంపీ ఇంట్లో చోరీ.. ఎస్పీ విసుర్లు!

9 Oct, 2017 19:29 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్: టీఆర్‌ఎస్ ఆదిలాబాద్‌ ఎంపీ నగేశ్‌ ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సాక్షాత్తు ఎంపీ నివాసంలో చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేశారు. అతని నుంచి దొంగతనం చేసిన సొత్తును రీకవరీ చేశారు.

తన ఇంట్లో నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారం, రూ. 2.50 లక్షల విలువైన వెండి, రూ. 70వేల నగదు అపహరణకు గురైనట్టు ఎంపీ నగేశ్‌ ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన సొత్తులో సగమే దొంగ నుంచి పోలీసులు రీకవరి చేయగలిగారు.

తాజా రీకవరీ నేపథ్యంలో ఎంపీ నగేశ్‌పై జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంపీ ఇంట్లో దొంగతనం జరిగితే.. దానికి తమపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పోలీసులపై ఎంపీ నగేశ్‌ వ్యాఖ్యలు విచారకరమన్నారు. ఎంపీకి ఇష్టం లేకపోతే తనను బదిలీ చేయించాలని ఎస్పీ శ్రీనివాస్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దొంగతనం నేపథ్యంలో పోలీసులపై ఎంపీ నగేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

గొడం నగేశ్‌ ఇంట్లో గత నెల చివరివారంలో భారీ చోరీ జరిగింది. ఆదిలాబాద్‌ హౌజింగ్‌బోర్డు కాలనీలో ఎంపీ నగేశ్‌ నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు అర్ధరాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు అల్మారాలోని వస్తువులు చిందర వందరగా పడేసి, రూ.17 లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు, రూ.70 వేల నగదును ఎత్తుకెళ్లారు. కాగా, దొంగలు ఎంపీ ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సీసీ పుటేజ్‌ హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు సైతం ఎలాంటి ఆధారం లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు