కుంటుపడిన ‘పల్లె’ పాలన

6 Oct, 2014 02:15 IST|Sakshi

 డిచ్‌పల్లి : దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లో పాలన కుంటుపడింది. దీంతో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర వహించే పంచాయతీ రాజ్ శాఖలో మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి కార్యదర్శుల కొరత వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇన్‌చార్జిల పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలోని పంచాయతీ రాజ్ శాఖలో అధికారుల సంఖ్య నానాటికి పలుచబడిపోతోంది.

 జిల్లాలో 36 మండలాలకు గాను 16 మండలాలకు ఇన్‌చార్జి ఎంపీడీఓలే విధులు నిర్వహిస్తున్నారు. 36 మండలాల్లో 718 గ్రామపంచాయతీలు ఉండగా పాలనా సౌలభ్యం కోసం 477 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. అయితే జిల్లాలో 148 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కో కార్యదర్శి రెండు, మూడు క్లస్టర్లకు ఇన్‌చార్జిగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీనికి తోడు పంచాయతీ రాజ్ శాఖలో కీలక భూమిక పోషించే ఈఓపీఆర్డీలదీ ఇదే పరిస్థితి. 36 మండలాలకు గాను కేవలం 14 మంది ఈఓపీఆర్డీలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

మిగిలిన మండలాల్లో సూపరింటెండెంట్లు, ఈఓలు ఇన్‌చార్జి ఈఓపీఆర్డీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు నాలుగైదు గ్రామాలకు ఇన్‌చార్జిలుగా విధులు నిర్వహించడంతో పనిభారం అధికమై ఏ ఒక్క గ్రామానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు.

దీనికి తోడు పలు గ్రామాల్లో బిల్‌కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, కారోబార్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పని భారాన్ని బట్టి గ్రామంలోని యువకులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకుని పని చేయించుకుంటున్నారు. ఇన్‌చార్జిల పాలనతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు సమస్యలతో సతమవుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 స్వరాష్ట్రంలోనైనా పరిస్థితులు మారేనా..
 ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీల భర్తీపై అప్పటి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ప్రస్తుతం మన రాష్ట్రం మనకు ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా పంచాయతీ రాజ్ శాఖలో పెరుగుతున్న ఖాళీల గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందని ఆశాభావంలో సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల ఖాళీలు ఉండడం వల్ల అభివృద్ధి అస్తవ్యస్థంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం పల్లెల అభివృద్ధి గురించి ఆలోచించి పంచాయతీ రాజ్ శాఖలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఇటు ప్రజలు, అటు శాఖలోని సిబ్బంది కోరుతున్నారు.

మరిన్ని వార్తలు