తాత, మనవడిని కబళించిన మృత్యువు | Sakshi
Sakshi News home page

తాత, మనవడిని కబళించిన మృత్యువు

Published Mon, Oct 6 2014 2:12 AM

తాత, మనవడిని కబళించిన మృత్యువు

పెనుకొండ :
 దసరా పండుగకు మనవళ్లను తనింటికి పిలుపుకుని వెళ్లిన ఆ తాత.. సోమవారం పాఠశాలలను తెరుస్తారని భావించి ద్విచక్ర వాహనంలో చిన్నారుల్ని వారి తల్లిదండ్రులకు వద్దకు తీసుకొస్తుండగా కారు రూపంలో మృత్యువు వెంటాడింది. తాత, ఓ మనవడిని కబలించింది. మరో మనవడు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కారులో ఉన్న బెంగళూరుకు చెందిన మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆదివారం పెనుకొండ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యంకు చెందిన బోయ చెన్నప్పకు, కొత్తచెరువు మండలం బైరాపురానికి చెందిన బోయ హనుమంతప్ప కుమార్తె లక్ష్మిదేవితో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారులు చెన్నకేశవులు(11), సాయిప్రసాద్ (10) ఉన్నారు. కుమారులపై ఎంతో మమకారం పెంచుకున్న చెన్నప్ప హమాలీ పని చేసి వారిని పోషిస్తున్నాడు.

తల్లి కూలీ పనులు చేసి వారిని పోషిస్తోంది. వారిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు కలలుగన్నారు. మండలంలోని వెంకటగిరిపాళ్యంలో  చెన్నకేశవులు 6వ తరగతి,సాయిప్రసాద్ 5వ తరగతి చదువుతున్నారు. దసరా సెలవులు రావడంతో వారుబైరాపురానికి అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వెళ్లారు. సోమవారం పాఠశాలలు తెరుస్తారని భావించిన తాత బోయ హనుమంతప్ప  మనవళ్లిదరినీ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంలో వెంకటగిరిపాళ్యంకు బయలుదేరారు. రాంపురం-మరువపల్లి దాటాక వెంకటరెడ్డిపల్లి వద్ద మట్టి రోడ్డు గుండా బైపాస్ రోడ్డు మీదుగా 44వ జాతీయ రహదారిపైకి ద్విచక్ర వాహనంలో చేరుకోబోయారు. ఈ సందర్భంలో అనంతపురం వైపు నుంచి వేగంగా వచ్చిన షిఫ్ట్ కారు ఢీకొంది. హనుమంతప్ప(60) ఎగిరి పడ్డంతో ఆయన కాళ్లు, చేతులు విరిగి పోయాయి. సంఘటన స్థలంలోనే  ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చెన్నకేశవులు, సాయిప్రసాద్‌లను వెంటనే 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తర లించారు. చికిత్స పొందుతూ సాయిప్రసాద్ మరణించాడు. తలకు తీవ్ర గాయాలైన చెన్నకేశవులు పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన బెంగళూరు నిమ్హాన్స్‌కు  తరలించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న బెంగళూరు ఉత్తరహళ్ళికి చెందిన రాజేష్ భార్య అరుణ, కుమార్తె మయూరకు గాయాలయ్యాయి.

రాజేష్‌తో పాటు వాహనంలో ఉన్న డాక్టర్ దేశ్‌పాండే, మరో వృద్ధురాలికి గండం తప్పింది. ప్రమాదంలో కారు, ద్విచక్రవాహనం దెబ్బతిన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పెనుకొండ ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కుమారులను చూపించాలంటూ అధికారులు, వైద్యుల్ని వేడుకున్నారు. బాధితుల్ని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. మీపైనే అన్ని ఆశలు పెట్టుకుంటే.. భగవంతుడు ఎంత పని చేసాడయ్యా.. అంటూ వారు గుండెలవిసేలా విలపించారు.  ఎంపీపీ యశోదమ్మ భర్త కేశవయ్య, జెడ్పీటీసీ నారాయణస్వామి, లక్ష్మినారాయణరెడ్డి, సూర్యనారాయణ తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల్ని ఓదార్చారు. వారికి సహా యం అందించారు. వెంకటగిరిపాళ్యం, బైరాపురం గ్రామాల  ప్రజ లు భారీగా తరలివచ్చారు.చెన్నకేశవులు వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు.



 

Advertisement
Advertisement