పుస్తకాల్లో వాస్తవాలు రాయరు

25 May, 2014 01:23 IST|Sakshi
పుస్తకాల్లో వాస్తవాలు రాయరు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటం గురించి వెలువడిన పుస్తకాల్లో వాస్తవాలను పొందు పరచలేదని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. చాలా మంది వారి జీవితచరిత్ర, లేదా అనుభవాలను క్రోడీకరించి వెలువరించే పుస్తకాల్లో నిజాలు చెప్పరన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంపై దివంగత కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు రాసిన పుస్తకం కూడా కొంత తప్పుల తడకగా ఉందని, అయితే దీన్ని తాను ఉద్దేశపూర్వకంగా తప్పుపట్టడం లేదని చెప్పారు. శనివారం మఖ్దూం భవన్‌లో నారాయణ రాసిన వ్యాసాలను పొందు పరిచి రూపొందించిన ‘ఉద్యమకారుని డైరీ’ని అరసం కార్యదర్శి ఎస్వీ సత్యనారాయణ, అలాగే జూలూరి గౌరిశంకర్ రచించిన ‘నారాయణ పోరుయాత్ర’ పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తనపై వెలువడిన రెండు పుస్తకాలు భావితరాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతానే తప్ప క్రిమినల్ ఆలోచనతో కాదని, అయినప్పటికీ అప్పుడప్పుడు తన మాటలు వివాదాస్పదం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రెండు ప్రాంతాల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సీపీఐని టీఆర్‌ఎస్‌తో జట్టు కట్టకుండా, సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీతో సీపీఎం పొత్తు కుదరకుండా కార్పొరేట్ శక్తులు ప్రయత్నించాయన్నారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ, నారాయణ తన వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకురాకపోయుంటే చారిత్రక తప్పిదం చేసినవారయ్యేవారని అన్నారు. కమ్యూనిస్టులు పలుచన కావడంతో దేశంలో ప్రమాదకరమైన ధోరణులు వస్తున్నాయని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, నారాయణ రాసే రచనలు, చేసే ఉద్యమాలను తెలంగాణ ప్రాంతం మరింత ఆశిస్తోందని, దీన్ని నిలబెట్టుకోవాలని ఆకాక్షించారు. నారాయణను వివాదాస్పద నాయకుడిగా చిత్రీకరించడాన్ని తాను విభేదిస్తానని నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. జూలూరు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వై.ఎస్.ఆర్.శర్మ, సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, పాశం యాదగిరి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు