ఉల్లి దిగొచ్చింది..

29 Sep, 2014 00:35 IST|Sakshi
ఉల్లి దిగొచ్చింది..
  •  హోల్‌సేల్‌గా కేజీ  రూ.17
  •  రిటైల్‌గా కేజీ రూ.20-25
  •  కొత్తపంట రాకతో తగ్గుముఖం
  • సాక్షి, సిటీబ్యూరో: నిన్నటి వరకూ ఘాటెక్కిన ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కొత్తపంట దిగుబడి మొదలు కావడంతో సామాన్యుడికి ఉల్లి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో నాణ్యమైన గ్రేడ్-1 ఉల్లి  కేజీ రూ.17లకు, గ్రేడ్-2 రకం ఉల్లి కేజీ రూ.10లకు లభిస్తోంది. అయితే... రిటైల్ మార్కెట్లో మాత్రం మొదటి ఉల్లి కేజీకి రూ.25లు, రెండో రకం రూ.20ల కు విక్రయిస్తున్నారు.  కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కొత్త పంట దిగుబడి మొదలైంది.

    దీనికితోడు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద మొత్తంలో సరుకు దిగుమతి అవుతుండడంతో నగర మార్కెట్‌ను ఉల్లి ముంచెత్తుతోంది. నగరంలోని హహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు నిత్యం  8 నుంచి10వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతవుతోంది.   గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1700లు, రెండో రకం రూ.1000లు ధర పలికింది. ఈ ప్రకారం గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.17లు, గ్రేడ్-2  ఉల్లి కేజీ రూ.10ల ధర నిర్ణయమైందన్న మాట.  

    హోల్‌సేల్ మార్కెట్‌కు వస్తోన్న సరుకులో 50శాతానికి పైగా స్థానికంగానే అమ్ముడుపోయాయి. ప్రస్తుతం జంటనగరాల్లో ఎక్కడా కూడా ఉల్లి కొరత లేదని, ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ధర లు తగ్గించేందుకు వ్యాపారులు ఇష్టపడడంలేదు. ఇప్పటికీ గ్రేడ్ టు ఉల్లిని గ్రేడ్‌వన్‌గా చూపించి రూ . 25కు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పదిరోజులుగా హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టినా రిటైల్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే తగ్గడం గమనార్హం.
     
    పెరిగిన విక్రయాలు

    రిటైల్ మార్కెట్ ధ రలతో పోలిస్తే రైతుబజార్లలో కాస్త తక్కువ ధర ఉడడంతో వినియోగదారులు ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.  ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్‌పల్లి వంటి రద్దీ రైతుబజార్లలో సాధారణ రోజుల్లో 50-60 క్వింటాళ్లు అమ్ముడుపోయే ఉల్లి ఆదివారం 90 క్వింటాళ్ల మేర విక్రయించారు. అల్వాల్, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఫలక్‌నుమా, మీర్‌పేట ైరె తుబజార్లలో సైతం ఉల్లి విక్రయాలు  జోరుగా సాగాయి.  
     

మరిన్ని వార్తలు