ఫోర్జరీ నేరంపై ముగ్గురికి రిమాండ్

15 Apr, 2015 18:18 IST|Sakshi

సంగారెడ్డి మున్సిపాలిటీ(మెదక్): మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ముగ్గురిని రిమాండ్‌కు పంపారు. సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కమీషనర్, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తన ఇంటిని మరొకరు అక్రమంగా సొంత చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పట్టణానికి చెందిన అంజయ్య చారి ఫిబ్రవరి 2వ తేదీన మునిసిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై కమిషనర్ విచారణ చేయించగా పట్టణానికి చెందిన ఉమర్‌హుసేన్, జావిద్, జిహీనోద్దీన్‌సాబేర్‌లు నకిలీ ఓనర్ షిప్ సర్టిఫికెట్ జతచేసి అంజయ్య చారికి చెందిన ఇంటిని తమ పేరున మార్చుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది.

దీనిపై కమిషనర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు వ్యక్తులపై ఫిబ్రవరి 2న 468, 471, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరిపారు. కేసును విచారించిన న్యాయస్థానం కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉమర్‌హుసేన్, జావిద్, జహీనోద్దీన్ సాబేర్‌లకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు