నేడు తెలంగాణ విమోచన దినోత్సవం

17 Sep, 2014 02:01 IST|Sakshi

 బయ్యారం : నైజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బయ్యారం యోధలది. తమకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న బయ్యారానికి చెందిన 30 మందిని నైజాం ప్రభువులు బలదీసుకున్నారు. అయినా వెనుకడుగు వేయక తెలంగాణ బానిస సంకెళ్లను తెంచేంతవరకు అలుపెరుగని పోరాటం చేసిన ఘనత ఈ ప్రాంత వాసులది.

 కంచర బుచ్చిమల్లు, దామినేని కోటేశ్వరరావులు ప్రాణాలను పణంగా పెట్టి కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు. 1948లో బండ్లకుంట సమీపంలో నైజాం పాలకులు తమ సైనికులతో వీరిద్దర్నీ కాల్చి చంపించారు. వీరి శవాలను బయ్యారం, గార్ల మండలాల్లో ఊరేగించి తమను వ్యతిరేకించిన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు.

కమ్యూనిస్టు నాయకులను కాల్చి చంపిన రెండు రోజల తరువాత అదే ప్రాంతంలో నిజాం సైనికులు మండలంలోని బండ్లకుంట, జాప్రాబాద్, జగ్నాతండా, బయ్యారం, చోక్లాతండా గ్రామాలకు చెందిన బీరవెల్లి లక్ష్మీనర్సయ్య, కంబాల చంద్రయ్య, అయిలబోయిన యర్రయ్య, సింగనబోయిన గంగయ్య, లింగయ్య, కారం మల్లయ్య, పాశం లచ్చయ్య, మాడె పాపయ్య, మాడె బుచ్చయ్య, తాటి బాలయ్య, భూక్య సక్రాం, వేములపల్లి శ్రీ కృష్ణ, తాటి మల్లయ్య, తాటి లక్ష్మయ్య, పెడుగు లక్ష్మీనర్సయ్య, కుంజ ముత్తిలింగయ్య, కారం గాదెయ్య, మోరె బాలయ్య, కుంజా జోగయ్య, మోకాళ్ళ యద్రయ్యలతో పాటు మరో పదిమందిని కాల్చి చంపి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు.

 తమ కళ్ల ముందే అనేక మంది ఉద్యమకారులను కాల్చిచంపినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా పోరాటంలో ముందుకు సాగారు మండలవాసులు. తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలర్పించిన యోధుల అమరత్వానికి సాక్షిగా 1969లో బయ్యారం మండలకేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు.

నాటి పోరాటస్ఫూర్తి గురించి అమరుడు బీరవెల్లి లక్ష్మీనర్సయ్య భార్య బీరవెల్లి వెంకటమ్మ ఏమంటున్నారో...
 పిల్లలు తండ్రిని చూడలేదు:  బీరవెల్లి వెంకటమ్మ, స్వాతంత్ర సమరయోధురాలు, బయ్యారం
 తెలంగాణ పోరాటం ప్రారంభమైనప్పుడు నాకు 26 ఏళ్లు. అప్పటికే నాకు నలుగురు సంతానం. రజాకార్లకు వ్యతిరేకంగా ఉన్నాడని మా పెద్దాయన్ను యూనియన్ పోలీసులు కాల్చి చంపిండ్రు. శవాన్ని కడసారి చూసుకోనివ్వలేదు. పది శవాలకు ఒకే చోట నిప్పుబెట్టిండ్రు.

మరో వైపు అదే రోజు బయ్యారం ఊరికి రజాకార్లు నిప్పుబెట్టడంతో ఇళ్లు కాలి నిల్వనీడ లేకుండా పోయింది. అప్పుడు మాపెద్దోడు వెంకటరెడ్డికి ఎనిమిదేళ్లు. చిన్నోడు రంగారెడ్డికి ఐదేళ్లు. పెద్దబిడ్డ భాగ్యమ్మకు మూడేళ్లు. చిన్నబిడ్డ అరుణ పుట్టి ఏడాది. తండ్రి ఎలా ఉంటాడో పిల్లలకు తెలియని వయసులో ఆయన్ను కాల్చిచంపిండ్రు. అప్పటినుంచి మాకు కష్టాలు మొద లయినై. ఆ తర్వాత పిల్లలతో కలిసి వరంగల్ జిల్లా కాంపెల్లిని మా తల్లిగారింటికి పోయిన. అక్కడే పిల్లలు పెద్దోళ్లయ్యేదాక ఉంచి విముక్తి పోరాటంలో పాల్గొన్న.

మరిన్ని వార్తలు