ఔటర్‌పై ‘వన్‌వే’ కష్టాలు

16 Oct, 2019 10:42 IST|Sakshi
నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో ట్రాఫిక్‌ జామ్‌ ఇలా...

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో వన్‌వే నిబంధన

ఔటర్‌ జంక్షన్‌లో బారులు తీరుతున్న వాహనాలు

ఖాజాగూడ, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నరకం  

రాయదుర్గం: ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌రోడ్డులో వన్‌వే ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నానక్‌రాంగూడ ఔటర్‌ జంక్షన్‌లో రెండు రోజులుగా భారీ ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయి. సోమవారం నుంచి ఈ వన్‌వేను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రారంభించారు. దీంతో నానక్‌రాంగూడ ఔటర్‌ జంక్షన్‌ నుంచి రోటరీ–1 నుంచి నార్సింగి వరకు వెళ్లే వాహనాలు మైహోమ్‌ అవతార్‌ వరకు వన్‌వే, నార్సింగి నుంచి వచ్చే వాహనాలు మైహోమ్‌ అవతార్‌ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని నానక్‌రాంగూడ జంక్షన్‌కు వచ్చి అండర్‌పాస్‌ మీదుగా ఖాజాగూడవైపు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8 గంటల నుంచి  11 గంటల వరకు సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు వాహనాలు బారులుతీరుతున్నాయి.

దీంతో ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ఇతర వాహనదారులు కనీసం గంటపాటు ట్రాఫిక్‌లో చిక్కుకొంటున్నారు. కొత్త నిబ«ంధనలతో నానా ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. నానక్‌రాంగూడ ఔటర్‌  సర్వీసు రోడ్డులో రెండు వైపులా టూ వే ఉండడంతో ఎలాంటి సమస్యలు లేకుండా రాకపోకలు నిర్వహించేవి. కానీ రెండు రోజులలో కొత్త నిబంధనలు పెట్టి వన్‌వే ఏర్పాటు చేయడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా రాజేంద్రనగర్, నార్సింగి, మెహిదీపట్నం, అప్పా జంక్షన్‌ నుంచి సర్వీస్‌ రోడ్డులో నిత్యం పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారు. వారితోపాటు స్థానికులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు నిర్వహించేలా, ఎక్కడా వాహనాలు ఆగకుండా చూడాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు