అక్రమార్కులకు లైన్ క్లియర్!

13 Nov, 2014 00:17 IST|Sakshi

 శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు అక్రమ వసూళ్లకు ‘టోకెన్ల’ పద్ధతి అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి శంషాబాద్ మీదుగా రాకపోకలు సాగించే భారీ వాహనాలకు టోకెన్లు జారీ చేసి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శంషాబాద్ మండల కేంద్రంలోని హోటళ్లు, చిరు వ్యాపారుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం.

ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో నెలకు సుమారు రూ.6 లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న తెలుస్తోంది. బెంగళూరు జాతీయ రహదారి, ఔటర్ రింగు రోడ్డుపై విజయవాడ, వరంగల్, మెదక్, ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు శంషాబాద్ మీదుగా సరుకు లారీలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి.

 లారీలో అక్రమంగా సరకులు తరలించే వారు, ఓవర్ లోడ్ తీసుకెళ్లే వాహనదారులు, అనుమతి పత్రాలు సరిగా లేని లారీల యజమానులు ట్రాఫిక్ పోలీసులకు మామూళ్లు చెల్లించాల్సిందే. గగన్‌పహాడ్ నుంచి పాల్మాకుల వరకు, ఔటర్ రింగు రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు రోజూ వాహనాల తనిఖీ చేపడుతుంటారు. ఈ సమయంలో నిబంధనలను అతిక్రమించి వెళ్తున్న లారీలకు జరిమానా విధించాలి.

 టోకెన్లతో జరిమానా మాఫీ..
 జరిమానా విధిస్తే తమకేం లాభం అనుకున్న ట్రాఫిక్ పోలీసులు లారీలకు ప్రత్యేకంగా టోకెన్లను జారీ చేస్తున్నారు. ఒక్కో లారీకి రూ.3000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా నెలకు వంద లారీల నుంచి కనీసం రూ.3 లక్షల వరకు అక్రమంగా ఆర్జీస్తూ జేబులు నింపుకొంటున్నట్లు సమాచారం.

ఓ తెల్లకాగితంపై స్టాంపు వేసి, ఈ వసూళ్ల బాగోతం చూసుకునే ట్రాఫిక్ కానిస్టేబుల్ సెల్ నంబరు, పేరును రాసి లారీ యజమానులకు ఇస్తారు. ఈ టోకెన్‌ను లారీ డ్రైవర్ ఎప్పుడూ తన వెంట పెట్టుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీలు చేస్తే ఈ టోకెన్ చూపిస్తే చాలు.. అక్కడి నుంచి లారీ వెళ్లడానికి అనుమతి దొరుకుతుంది.

 వసూళ్ల కోసం ప్రత్యేక సిబ్బంది..
 అక్రమ వసూళ్లు చేయడానికి ట్రాఫిక్ విభాగంలో ముగ్గురు ప్రత్యేక సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ స్థాయి సిబ్బందిని రోజూ వారీ విధులకు వినియోగించకుండా ఉన్నతాధికారులు ఈ అక్రమ వసూళ్లకు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి తరచూ డ్యూటీ ప్రాంతాలను మారుస్తుంటారు.

 కానీ అక్రమ వసూళ్లు చూసుకునే సిబ్బందికి ఎప్పుడూ ఒకే చోట డ్యూటీ వేస్తున్నారని ఆరోపణలున్నాయి. పోనీ... అక్కడైనా అతను విధులు నిర్వహిస్తాడనుకుంటే పొరపాటే. పేరుకు అతను డ్యూటీలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ వసూళ్లకు పంపుతుంటారని తెలుస్తోంది. ఈ అక్రమ వసూళ్ల బాగోతం చూసుకునే మరో సిబ్బంది స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ట్రాఫిక్ విభాగంలో రైటర్‌లకు పెద్దగా పని ఉండదు. అయినా ఇక్కడ ఇద్దరు రైటర్‌లను నియమించి, అందులో ఒకరిని వసూళ్లకు పంపుతున్నట్లు వినికిడి.

 అబ్బే అదేం లేదే..
 లారీల యజమానుల వద్ద అక్రమ వసూళ్ల కోసం టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.నవీన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. అబ్బే అలాంటిదేమీ లేదే.. మా వద్ద అలాంటివేవీ జరగడంలే దన్నారు.

మరిన్ని వార్తలు