నాగర్‌కర్నూల్‌లో ప్రచారం.. హోరాహోరీ 

8 Apr, 2019 10:12 IST|Sakshi
నాగర్‌కర్నూల్‌లో ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ అభ్యర్థి రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌లో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు 

రోడ్‌ షోల్లో విస్తృతంగా  సాగుతున్న అభ్యర్థుల ప్రచారం 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎన్నికలు సమీపిస్తుండడంతో నాగర్‌కర్నూల్‌ నియోజకవకర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు విస్తృతంగా ప్రచారం చేయడంతో గ్రామాల్లో సైతం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు ఎవరికి వారు తమ సొంత అంచనాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మండలాల వారికి వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుని నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. 

టీఆర్‌ఎస్‌ రోడ్‌ షో... 
నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు సంబంధించి ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముమ్మరమైంది. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్‌ షోలు ఇతర కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడంతో పాటు ఎమ్మెల్యే ఎన్నికల మాదిరి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో 259 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 2,14,095మంది ఓటర్లు ఉన్నారు.

ఇందులో 1,07,525మంది పురుషులు, 1,06,567మంది స్త్రీలు, ముగ్గురు ఇతరులు ఉన్నారు. కాగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీఆర్‌ఎప్‌ పార్టీకు సంబంధించి అన్ని మండలాల్లో కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్‌ యాదవ్, జక్కా రఘునందన్‌రెడ్డిలు నియోజకవర్గంలోని గ్రామాల్లో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగం జనార్దన్‌రెడ్డి ఓటమి పాలవ్వడంతో పార్టీకి చెందిన క్యాడర్‌ మొత్తం నిస్తేజంలో ఉండిపోయింది. పార్టీకి ఎంపీగా పోటీచేస్తున్న మల్లు రవి నాగర్‌కర్నూల్‌కు పాత వ్యక్తి కావడం, కొంత మంది మద్దతు ఉన్నారు.  

పోటీ.. హోరాహోరీ  
నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్,  కాంగ్రెస్‌ల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఫలితాలు రావడంతో నియోజకవర్గంలో పరిస్థితులు కూడా మారాయి. ఎన్నికల తర్వాత కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు పార్టీలో ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ నాయకులు కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం కొన్ని గ్రామాలలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం నిర్వహించడానికి కూడా క్యాడర్‌ లేని పిరిస్థితి నెలకొందనేది కొందరి వాదన.

ఇటీవల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు కొంత ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బండారు శ్రుతి ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో తన ప్రచారం ముమ్మరం చేసింది. బీజేపీలో ఉన క్యాడర్‌ మొత్తం తనకు సహకరిస్తుండడంతో ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి.    

>
మరిన్ని వార్తలు