ఎన్నికల ప్రచారం.. షురూ !

9 Sep, 2018 10:40 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రం ప్రభుత్వం దాదాపు 9 నెలల ముందుగానే రద్దు కావడం.. ఆ వెనువెంటనే టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఆయా ప్రతిపక్ష పార్టీల తరఫున ఇంకా అభ్యర్ధులను ఖరారు చేయకున్నా.. అపుడే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రచారం పోటా పోటీగా మొదలైంది. టీఆర్‌ఎస్‌ కోదాడ, హుజూర్‌నగర్‌లో తప్ప మిగిలిన పది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ, ఇతర పార్టీలన్నీ ఇంకా పొత్తులపై ఎటూ నిర్ణయించుకోలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. చివరకు కాంగ్రెస్‌ సైతం అభ్యర్థుల విషయంలో ఉలుకూ పలుకూ లేకుండానే ఉంది. మరోవైపు సీపీఐ, టీడీపీ, బీజేపీ, సీపీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీలు తాము పోటీ చేయబోయే స్థానాలపై కానీ, అభ్యర్థుల విషయంగా కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రెండు రోజుల కిందటే ప్రచారం మొదలుపెట్టారు. కొన్నింటిని మినహాయిస్తే, మెజారీటీ నియోజకవర్గాల్లో ప్రచారం షురూ అయ్యింది.

దేవాలయాల్లో పూజలతో ప్రచారానికి శ్రీకారం
టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారు కానీ కోదాడ, హుజూర్‌నగర్‌లో ఎలాంటి కదలికా లేదు. అసమ్మతి గళాలు ఎక్కువగా వినిపిస్తున్న మిర్యాలగూడలోనూ చడీ చప్పుడు లేదు. నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నోముల నర్సింహయ్య ఇప్పటికే పూజలు చేసి ప్రచారం మొదలు పెట్టారు. దేవరకొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి రమవాత్‌ రవ్రీందకుమార్‌ శుక్రవారమే చింతపల్లి సాయిబాబా దేవాయలంలో పూజలు చేసి బైక్‌ ర్యాలీతో ప్రచారంలోకి దిగారు. మునుగోడులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రచారంలో మునిగిపోయాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి శనివారం అంథోల్‌ మైసమ్మ గుడిలో అపద్దర్మ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పూజలు చేశారు. కాంగ్రెస్‌ తరఫున తానే బరిలోకి దిగుతున్నానని ప్రకటించిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రెండు రోజులుగా ఆయా మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పూజలతో ప్రచారంలోకి దిగారు. తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిషోర్‌ కుమార్‌ శనివారం అర్వపల్లి దేవాలయంలో పూజలు చేసి రెండు మండలాల్లో ప్రచారం చేశారు.

అపద్దర్మ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శనివారం జిల్లా సరిహద్దులోని అంథోల్‌ మైసమ్మ గుడిలో పూజలు చేశాక, సూర్యాపేట చేరుకుని ప్రచార ఢంకా మోగించారు. నకిరేకల్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ప్రచారంలో దిగాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల వీరేశం రెండు రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఇంకా టికెట్‌ ప్రకటించకున్నా, పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న చిరుమర్తి లింగయ్య సైతం శుక్రవారమే ప్రచారంలోకి దిగారు. నల్లగొండ నియోజకర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారమే దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి కనగల్‌ మండలంలోప్రచారం మొదలు పెట్టారు. శనివారం తిప్పర్తి మండలంలో  ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌ రోడ్‌లోని మర్రిగూడ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. పార్టీలో ఉన్న సీనియర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఆయన ప్రచార రథం జిల్లా కేంద్రంలో వీధుల్లో ప్రచారం చేస్తోంది. బీజేపీ ప్రచార రథం సైతం నల్లగొండలో రోడ్లపైకి ఎక్కింది. మంచి రోజులు, ముహూర్త బలం, సెంటిమెంటు ఉన్న దేవాలయాలు చూసుకుని పూజలతో ప్రచారం మొదలు పెట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు