గులాబీ పార్టీకి కొత్తరూపు

8 Feb, 2019 00:14 IST|Sakshi

జిల్లా సమన్వయకర్తల వ్యవస్థ 

త్వరలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ 

రికార్డుస్థాయి సభ్యత్వనమోదే లక్ష్యం 

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్ణయం 

లోక్‌సభ ఎన్నికల తర్వాత సంస్థాగత ప్రక్రియ!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి కొత్తరూపును సంతరించుకోనుంది. ఆ పార్టీని తిరుగులేని రాజకీయశక్తిగా మార్చేందుకు కసరత్తు సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొత్తరూపు తెచ్చేలా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్‌ఎస్‌ ఇప్పుడున్న దాని కంటే కీలకంగా పనిచేసేలా మార్పులు చేయా లని భావిస్తున్నారు. 2017 సంస్థాగత ఎన్నికల ప్రక్రి య సందర్భంగా రద్దయిన టీఆర్‌ఎస్‌ జిల్లా కమిటీల వ్యవస్థను మరో రూపంలో తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఒక సమన్వయకర్తను నియమించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీ తరఫున అన్ని విషయాలను ప్రజలకు చేరవేసేలా జిల్లా సమన్వయకర్తలకు బాధ్యతలు అప్పగించనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ కార్యాలయాలను నిర్మించాల ని నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపట్టారు.

ఈ కార్యాలయాలే వేదికగా టీఆర్‌ఎస్‌ జిల్లా సమన్వయకర్తలు పనిచేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్ర మాలు, టీఆర్‌ఎస్‌ విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దనున్నా రు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ వ్యవస్థ బలంగా ఉండేలా మార్పులు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నియమావళి ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను నిర్వహిం చాల్సి ఉంటుంది. 2017లో చివరిసారి టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరిగింది. మళ్లీ ప్రస్తుత ఏడాదిలో జరగనుంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రక్రియలో నే జిల్లా సమన్వయకర్తల నియామకం జరగనుంది. చివరగా టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినం(ఏప్రిల్‌ 27) రోజున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టా లని మొదట అనుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాతే వీటిని చేపట్టాలని భావిస్తున్నారు.

రికార్డుస్థాయి సభ్యత్వం... 
రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా బలోపేతం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో అవసరమైన మేరకు పార్టీ సలహాలు ఉండేలా మార్పులు చేయనుంది. మొదటగా రికార్డుస్థాయి సభ్యత్వాలను నమోదు చేయాలని భావిస్తోంది. సభ్యత్వ నమోదు ప్రక్రియలో గతంలో జరిగిన పొరపాట్లకు ఈసారి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించింది. 2017లో నిర్వహించిన సభ్యత్వ నమోదు ప్రక్రియ ఒకింత గందరగోళంగా మారింది. అప్పుడు టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం నుంచి 75 లక్షల సభ్యత్వాల మేరకు పుస్తకాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఇతర ముఖ్యనేతలు తీసుకెళ్లారు. 70 లక్షల సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపారు. అయితే, 43 లక్షల సభ్యత్వాలకు సంబంధించిన పుస్తకాలే టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయానికి చేరాయి. నియోజకవర్గాలకు తీసుకెళ్లిన సభ్యత్వ పుస్తకాలు తిరిగి రాకపోవడంతో ముందుగా అనుకున్న సభ్యత్వనమోదు లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించే సభ్యత్వ నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కేటీఆర్‌ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు