పన్ను పెంపు లేనట్టేనా?

29 Mar, 2020 01:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను పెంచాలనే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పన్నుల పెంపునకు సంబంధించిన అన్ని కసరత్తులను పక్కనపెట్టేయాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ యంత్రాం గానికి సూచించినట్టు సమాచారం. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యమనే కోణంలోనే ముందుకెళ్లాలని, మిగిలిన అన్ని అంశాలను పక్కనపెట్టాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారనే చర్చ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడటమే బాధ్యతగా ముందుకెళ్లాలని ఆయన ప్రతిరోజూ నిర్దేశిస్తున్నారని అధికారులు చెపుతున్నారు.

ఈ విషయమై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపు అంశం ఇప్పట్లో సీఎం ముందు చర్చకు పెట్టే పరిస్థితి కూడా లేదని, అన్నీ సర్దుకున్న తర్వాత జూలైలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతోపాటు ఇప్పటికే చెల్లించాల్సిన ఆస్తిపన్ను మార్చి 31లోపు వసూలు చేయాలని, లేదంటే యజమానులకు నోటీసులు జారీ చేయాలని గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా వాయిదా పడుతుందని తెలుస్తోంది. దీని రీషెడ్యూల్‌కు సంబంధించిన ప్రకటనను త్వరలోనే సీఎం అధికారికంగా వెల్లడిస్తారని, రాష్ట్రంలో ఎలాంటి దైనందిన కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఆస్తి పన్ను చెల్లింపు రీషెడ్యూల్‌ తథ్యమని అధికార వర్గాలంటున్నాయి.    

మరిన్ని వార్తలు