రూ.24,577 కోట్లు.. 2,253 పరిశ్రమలు..

15 Mar, 2020 08:22 IST|Sakshi

గతేడాది 9 నెలల్లో భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు

అవి పూర్తయితే 1,70,888 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు..

ఇంజనీరింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు డిమాండ్‌ అధికం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పారిశ్రామిక విధానం ‘టీఎస్‌ ఐపాస్‌’ద్వారా 9 నెలల వ్యవధిలో రాష్ట్రానికి రూ.24,577 కోట్ల పెట్టుబడులతో 2,253 పరిశ్రమలొచ్చాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు పూర్తయితే 1,70,888 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. 2019 ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఏడాదిన్నరగా తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ఎలాంటి ప్రభావం పడకపోవడం గమనార్హం. కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. అత్యధిక సంఖ్యలో వరుసగా ఇంజనీరింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత, సిమెంట్, కాంక్రీట్‌ ఉత్పత్తులు, బూడిద ఇటుకులు, గ్రానైట్, స్టోన్‌ క్రషింగ్, ప్లాస్టిక్‌ అండ్‌ రబ్బర్‌ ఉత్పత్తుల పరిశ్రమలు అత్యధిక సంఖ్యలో వచ్చాయి. వీటిలో రూ.712.58 కోట్ల పెట్టుబడులతో 437 ఇంజనీరింగ్‌ పరిశ్రమలు అగ్రస్థానంలో నిలిచాయి. ఇక ఇవి ఏర్పాటైతే 9,186 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 

6,23,071 మందికి ఉద్యోగాలొచ్చాయి 
ఇక టీఎస్‌ ఐపాస్‌ ద్వారా గత ఐదేళ్లలో రూ.1,84,655.44 కోట్ల పెట్టుబడులతో మొత్తం 11,857 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ పరిశ్రమల ఏర్పాటు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైతే 13,08,056 మందికి ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. గత డిసెంబర్‌ 31 నాటికి రూ.85,125.83 కోట్ల పెట్టుబడులతో 9,020 పరిశ్రమల ఏర్పాటు పూర్తి కావడంతో 6,23,071 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రూ.28,116.96 కోట్ల పెట్టుబడులతో చేపట్టిన మరో 764 పరిశ్రమలు తుదిదశలో ఉండగా, వీటి నిర్మాణం పూర్తయితే 2,87,112 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి. రూ.51,023 కోట్ల పెట్టుబడితో వచ్చిన 1,428 పరిశ్రమల ఏర్పాటు ప్రారంభ దశలో ఉంది. వీటి ఏర్పాటు పూర్తయితే మరో 2,57,323 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అనుమతులు పొందిన పరిశ్రమల్లో ఇంకా 1,428 పరిశ్రమలు ప్రారంభం కాలేదు. రూ.20,388.85 కోట్ల పెట్టుబడులతో వచ్చిన పరిశ్రమలు ఏర్పాటైతే 1,40,550 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.  

భారీగాపెరిగిన ఎగుమతులు 
ఇక రాష్ట్రం నుంచి వస్తు సేవల ఉత్పత్తుల ఎగుమతులు గతేడాది భారీగా పెరిగాయి. 2017–18లో రూ.1,35,783 కోట్లు విలువ చేసే ఎగుమతులు జరగ్గా, 2018–19లో రూ.1,59,729 కోట్లకు ఎగబాకాయి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటెలిజెన్స్‌ స్టాటిస్టిక్స్‌ గణాంకాల ప్రకారం 2015–16లో రూ.35,444 కోట్లు విలువ చేసే వస్తు ఎగుమతులు జరగ్గా, 2018–19లో రూ.50,510 కోట్లకు పెరిగాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే 2018–19లో జరిగిన వస్తు ఎగుమతుల్లో 12.5 శాతం వృద్ధి కనబడింది.
  

మరిన్ని వార్తలు