పార్లమెంట్‌ కసరత్తు! 

22 Feb, 2019 10:20 IST|Sakshi

శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరాజయాన్ని మూటగట్టుకున్న కమలనాథులు ఆ చేదు ఫలితాలను ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నారు. మరో రెండు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వం కసరత్తు మొదలు పెట్టింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎన్నికలకు తయారు చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను రూపొందిస్తోంది.  ఇందుకోసం జాతీయ నాయకత్వాన్ని పిలిపించి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని చూస్తోంది. 

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి లోక్‌సభా స్థానాలతో పాటు ఖమ్మం లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్‌చార్జులను ఎన్నికల దిశలో కార్యోన్ముఖులను చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగానే ఈ నెల 25వ తేదీన నకిరేకల్‌లో నల్లగొండ, భువనగిరి, ఖమ్మం ఎంపీ స్థానాల పరిధిలోని కేడర్‌తో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది. మార్చి మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలకు ప్రకటన వెలువడే అవకాశం ఉండడంతో క్షేత్ర స్థాయిలో పార్టీకి కాయకల్ప చికిత్స చేసే పనిలో పడింది. రాష్ట్ర శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికలు పార్టీకి చేసిన గాయాన్ని మరిచిపోయి మళ్లీ ఎన్నికల పనిలో పడేలా వ్యూహాలు రచిస్తోంది.
 
పార్లమెంటు క్లస్టర్‌ సదస్సులు
పార్టీ కార్యకర్తలను ఎన్నిలకు తయారు చేయడం, నాయకత్వంలో పోరాట పటిమను పెంచడం లక్ష్యంగా పార్లమెంటు క్లస్టర్‌ సదస్సులు ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా  రెండు, మూడు లోక్‌సభా నియోజకవర్గాలకు కలిపి ఒక పార్లమెంట్‌ క్లస్టర్‌గా రూపొందించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా ఎంపీ స్థానాల పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్‌చార్జులు, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంటున్నారు. ఈ సదస్సులకు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జులతో జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు కూడా హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే.. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం లోక్‌ సభాస్థానాల క్లస్టర్‌ సదస్సు ఈ నెల 25న నకిరేకల్‌లో ఏర్పాటు చేశారు. కేడర్‌లో ఉత్సాహం నింపడం కోసం ఉద్దేశించిన ఈ సదస్సులకు బయటి రాష్ట్రాలనుంచి కూడా నాయకులు హాజరవుతారని పార్టీ నాయకత్వం చెబుతోంది. నకిరేకల్‌ సదస్సుకు ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం మౌర్య హాజరవుతున్నారని, ఆయనతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌  పాల్గొననున్నారు.
 
26వ తేదీన కమలజ్యోతి కార్యక్రమం
శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు స్థానాలకు గాను భువనగిరి నియోజకవర్గంలో యువతెలంగాణ పార్టీకి మద్దతు ఇచ్చిన బీజేపీ, మిగిలిన పదకొండు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. సూర్యాపేట, మునుగోడు వంటి నియోజకవర్గాల్లోనే కాస్తో, కూస్తో పోటీ ఇవ్వగలిగింది. పలువురు జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు కాలికి బలపం కట్టుకుని తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వంటి వారు కూడా ప్రచారం చేశారు. అయినా.. అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి కలిసిరాలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ నెల 25వ తేదీన నకిరేకల్‌లో పార్లమెంట్‌ క్లస్టర్‌ సదస్సు ముగిసిన మరుసటి రోజు నుంచే ప్రచారానికి దిగాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే 26వ తేదీన చేపట్టే కమలజ్యోతి కార్యక్రమంతో ఇంటింటికీ తిరగాలని భావిస్తోంది. కేంద్ర పథకాలతో లబ్ధిపొందిన వారందరినీ ప్రత్యక్షంగా కలవడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నామని, తిరిగి కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేలా తమ పార్టీని దీవించాలని కోరుతామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆ తర్వాత  మార్చి 2వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణప్రాంతాల్లో 150 కి.మీలు, పట్టణ ప్రాంతాల్లో  50 కి.మీ వరకు బైక్‌ ర్యాలీ జరపాలని నిర్ణయించారు. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే కంటే ముందే గ్రామసీమలను చుట్టి వచ్చే పనిలో బీజేపీ పడింది.

మరిన్ని వార్తలు