ప్రగతి చక్రం !

1 Nov, 2018 11:05 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఆదాయ ఆర్జనలో వరంగల్‌ రీజియన్‌  అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 11 రీజియన్లు ఉండగా.. ఒక్క వరంగల్‌ రీజియన్‌ మాత్రమే లాభాల్లో ఉండడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్‌ మాసం వరకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో అర్ధ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి రూ.18.62 కోట్ల లాభంతో ముందంజలో ఉంది. వరంగల్‌ రీజియన్‌ పరిధిలో నిత్యం 980 బస్సులు రోజుకు 3.80 లక్షల కిలో మీటర్లు దూరం తిరగడం ద్వారా రోజుకు రూ.కోటికి పైగా ఆదాయం సంపాదిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం అర్థ సంవత్సరం (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌) వరకు ఆర్టీసీ రూ.3 కోట్ల నష్టంలో ఉంది. దీన్ని అధిగమించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ నాటికి రూ.18.62 కోట్ల లాభంతో రాష్ట్రంలోనే వరంగల్‌ రీజియన్‌ ఎవరికీ అందనంత దూరంలో పరుగులు పెడుతోంది.

మహబూబాబాద్‌ మినహా అన్ని డిపోలు లాభాల్లోకి..
ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ పరిధిలో తొమ్మిది డిపోలు ఉన్నాయి. ఒక్క మహబూబాబాద్‌ మినహా మిగతా ఎనిమిది డిపోలు లాభాల్లోకి వచ్చాయి. మహబూబాబాద్‌ డిపో గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ నాటికి రూ.3 కోట్ల నష్టంలో ఉండగా ఈ దఫా రూ.2.59 కోట్ల అధనపు ఆదాయాన్ని సంపాదించి నష్టాన్ని రూ.41 లక్షలకు తగ్గించుకుంది. తొర్రూరు, భూపాలపల్లి, నర్సంపేట, జనగామ, వరంగల్‌–1, పరకాల, వరంగల్‌–2, హన్మకొండ డిపోలు లాభాల బాటలో నడుస్తున్నాయి. తొర్రూరు డిపో రూ.90 లక్షల నష్టాల్లో నుంచి రూ.4.13 కోట్ల లాభాల్లోకి చేరుకుంది. వరంగల్‌–2 డిపో రూ.1.20 కోట్లు, భూపాలపల్లి డిపో రూ.3.4 కోట్ల లాభాల్లో ఉంది. వరంగల్‌–1 డిపో రూ.6.50 కోట్లు, వరంగల్‌–2 , నర్సంపేట డిపోలు రూ.1.3 కోట్ల చొప్పున, జనగామ డిపో రూ.1.5 కోట్లు, పరకాల డిపో రూ.50 లక్షలు, హన్మకొండ డిపో రూ.5 లక్షల లాభాల్లోకి వచ్చాయి.

రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మన డివిజన్లే..
లాభాలకు సంబంధించి వరంగల్‌ రీజియన్‌లోని రెండు డివిజన్లు రాష్ట్రంలో తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. లాభాల్లో వరంగల్‌ రూరల్‌ డివిజన్‌ తొలిస్థానంలో నిలవగా..  వరంగల్‌ అర్బన్‌ డివిజన్‌ రెండో స్థానంలో ఉంది. వరంగల్‌ రూరల్‌ డివిజన్‌ గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి అర్ధ వార్షికోత్సవంలో రూ.6 కోట్ల నష్టం నుంచి రూ.9 కోట్ల లాభాల్లోకి వచ్చింది. వరంగల్‌ అర్బన్‌ రూ.4 కోట్ల నుంచి రూ.9 కోట్ల లాభాల్లోకి చేరుకుంది. వరంగల్‌ రూరల్‌ డివిజన్‌ రూ.కోట్ల నష్టాన్ని పూడ్చుకుని అదనంగా రూ.14 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకుని రూ.9 కోట్ల లాభాలతో రాష్ట్రంలో అగ్రభాగంలో నిలిచింది.

ముందంజలో ఏడు డిపోలు..
వరంగల్‌ రూరల్‌ డివిజన్‌ పరిధిలో పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, తొర్రూరు డిపోలున్నాయి. వరంగల్‌ అర్బన్‌ డివిజన్‌ పరిధిలో వరంగల్‌–1, వరంగల్‌–2, హన్మకొండ, జనగామ డిపోలున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం సాధించే మొదటి పది డిపోలలో వరంగల్‌ రీజియన్‌కు చెందిన ఏడు డిపోలు ముందు భాగంలో ఉన్నాయి. తొర్రూరు డిపో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. భూపాలపల్లి డిపో ద్వితీయ స్థానంలో ఉంది. అ తర్వాత వరుసగా నర్సంపేట, జనగామ, వరంగల్‌–1, పరకాల, వరంగల్‌–2 డిపోలు ఉన్నాయి.
 
సంస్కరణలు, సమష్టి కృషే కారణం

వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌గా తోట సూర్యకిరణ్‌ వచ్చిన రెండేళ్ల కాలంలో రీజియన్‌లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. డ్రైవర్లకు గుర్తింపు తీసుకొచ్చేలా డ్రైవర్స్‌ డే నిర్వహించారు. కండక్టర్, డ్రైవర్‌ సమన్వయంగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. అద్దె బస్సు యజమానులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తూ, అద్దె బస్సు డ్రైవర్లకు ప్రశంసపత్రాలు అందజేస్తూ ప్రోత్సహించారు. కార్మికులు, ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు ఇచ్చి ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ఉత్సాహం నింపారు. ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో ఇంక్రిమెంట్లు ఇస్తూ, అద్దె బస్సుల యజమానులకు సమయానికి చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్‌ రీజియన్‌లో కార్మికులు, ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పని చేసి  లాభాల బాటలోకి తీసుకొచ్చారు.

గత ఏడాది 40 వేల పాస్‌లు జారీ చేయగా ఈ ఏడాది 80 వేల విద్యార్థి పాస్‌లు జారీ చేసి విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా చేశారు. ప్రతి నెలా ఉద్యోగులు, కార్మికులు రిటైర్‌ అవుతున్నా.. కొత్తగా నియామకాలు చేపట్టకుండా.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, కార్మికులతో పని చేయించుకుంటూ రీజియన్‌ను లాభాల బాటల్లోకి తీసుకురావడంలో కృషి చేశారు. ఈ ఏడాది 320 కొత్త బస్సులను ప్రవేశ పెట్టారు. 180 ఆర్టీసీ సొంత బస్సులు కాగా.. 150 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకొచ్చారు. బెంగళూర్‌కు 3 నుంచి 5 బస్సులకు పెంచారు. దీంతో పాటు విశాఖపట్నం, మచిలీ పట్నం, శ్రీశైలానికి అదనంగా.. పుట్టపర్తికి కొత్తగా బస్సులు ప్రవేశ పెట్టారు. దీంతో పాటు అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పని చేసి అతి పెద్ద విజయం సాధించారు.  అందరికి ఆదర్శంగా నిలిచారు. 

మరిన్ని వార్తలు