లేఖ ఇచ్చినా డ్యూటీ దక్కలేదు

14 Nov, 2019 03:06 IST|Sakshi

సమ్మె నుంచి బయటకొచ్చిన ఆర్టీసీ కార్మికుల్లో కొందరి పరిస్థితి అయోమయం

సాక్షి, హైదరాబాద్‌ : సమ్మెలో ఉండి తిరిగి విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల్లో కొం దరి పరిస్థితి అయోమయంలో పడింది. ఈనెల ఐదవ తేదీ అర్ధరాత్రి లోపు విధు ల్లో చేరినవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పెట్టిన గడువుకు 495 మంది విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతూ లేఖలు ఇచ్చారు. వారిలో 220 మందే ఇప్పుడు విధులకు హాజరవుతున్నారు. మిగిలిన 275 మందిని సమ్మెలో ఉన్నట్టుగానే అధికారులు పరిగణిస్తున్నారు. వీరు సమ్మెలోకి వెళ్లకుండా విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. అధికారులనుంచి పిలుపు రాకపోవటంతో వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరు విధుల్లో చేరుతున్నట్లు సమర్పించిన లేఖ లు తమకు అందలేదని డిపో మేనేజర్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి వేతనాల్లేక ఇబ్బంది పడుతున్నందున, ఇప్పుడు డ్యూటీలో లేనట్టుగా అధికారులు పరిగణిస్తే ప్రస్తుత నెల వేతనం కూడా అందదన్న ఆందోళనతో ఉన్నారు.  

అసలేం జరిగింది.. 
ఈనెల 2న సీఎం కేసీఆర్‌ ఇచ్చిన గడువు ప్రకటనకు తొలిరెండ్రోజులు కార్మికుల నుంచి స్పందనలేదు. పనిచేస్తోన్న డిపోలోనే కాకుండా ఏ డిపోలో లేఖ ఇచ్చినా స్వీకరిస్తామని, కలెక్టరేట్లు, పోలీసు స్టేషన్లు, ఆర్డీఓ కార్యాలయాలు..ఇలా కొన్ని ప్రత్యామ్నాయ కార్యాలయాలను ప్రకటించారు. చివరిరోజు ఎక్కువ మంది కార్మికులు ఆయా ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో అందజేశారు. ఈ లేఖల్లో కొన్ని మాత్రమే సంబంధిత డిపోలకు చేరగా, మిగతావి అందలేదు. ఇప్పుడదే ఈ గందరగోళానికి కారణమైంది.  సమ్మె నుంచి బయటకొచ్చి ధైర్యం చేసి లేఖలిచ్చినా, అధికారులకు చేరకపోవటంతో వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. తమకు గడువులోపు లేఖలు అందినవారినే విధుల్లోకి తీసుకున్నామని, లేఖలిచ్చి విధులకు రాని వారి ని, లేఖలు ఇవ్వనివారిని సమ్మెలోనే ఉన్నట్టుగా పరిగణిస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు