శ్రీ చైతన్య, నారాయణ గుర్తింపు రద్దు చేయాలి 

28 Mar, 2018 08:20 IST|Sakshi
విద్యార్థులను అరెస్టు చేస్తున్న పోలీసులు 

నాంపల్లి : శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్‌ విద్యా సంస్థలను రద్దు చేయాలని, కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థుల మరణానికి కారకులైన యాజమాన్యాలపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షులు మద్దిలేటి, ప్రధాన కార్యదర్శి మెంచు సందీప్‌ అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. వారు మాట్లాడుతూ... కార్పొరేట్‌ సంస్థలు  ర్యాంకుల పేరుతో విద్యార్థులను చంపుతున్నాయని ఆరోపించారు. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు విద్యను వ్యాపారం చేశాయన్నారు.

గత ఏడాది అక్టోబర్, నవంబరు మాసాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు విద్యాసంస్థల్లోనే 47 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. అయినా యాజమాన్యాలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బోర్డు అధికారుల నుంచి రాష్ట్ర మంత్రుల దాకా వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే కేజీ నుంచి పీజీదాకా ఉచిత విద్య అందించాలని కోరారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ప్రైవేట్‌ యూనివర్శిటీ బిల్లును ఉప సంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీవీవీ నేతలు స్వాతి, రాహుల్, కిషోర్, నజీర్, మహేష్,  సందీప్, మహేష్, చందూలాల్, బలరాం, నాగరాజు, భాస్కర్, వేణు, విష్ణు, గోపి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు