ఇద్దరికే చాన్స్?

31 May, 2014 23:40 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  తెలంగాణ రాష్ట్ర తొలి  ముఖ్యమంత్రిగా గులాబి దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8.25 నిమిషాలకు ఆయన ప్రయాణ స్వీకారం చేయనుండగా, అదే వేదిక మీద రాష్ట్ర  మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 14 మందితో కొలువుదీరనున్న కేసీఆర్ మంత్రివర్గంలో జిల్లా నుంచి ఇద్దరికి చాన్స్ దక్కినట్లు తెలుస్తోంది.
 
 తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్ పార్టీకి వెన్నెముకగా నిలబడిన  సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుకు కీలకమైన భారీ నీటిపారుదల, విద్యుత్ శాఖలతో పాటు వ్యవసాయ శాఖను కూడా అప్పగిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, రైతులకు రుణమాఫీ వంటీ కీలక హామీలు ఇవ్వడం వల్ల వీటిని సమర్థవంతంగా నిర్వహించేందుకే కేసీఆర్ ఏరికోరి హరీష్‌రావుకు ఆ శాఖలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక జిల్లాకు కేటాయించనున్న రెండో పదవిపైనే సందిగ్ధం నెలకొని ఉంది. దీనిపై పార్టీ సీనియర్ నాయకులు కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. వడపోత విధానంలో కేసీఆర్ తన మిత్రుడు బాబూమోహన్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
 
 మెదక్‌లో రాములమ్మను మట్టికరిపించిన పద్మాదేవేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్లలను తొలుత  కేసీఆర్ పరిశీలించినట్లు సమాచారం. అయితే తన నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు, హరీష్‌రావు నియోజకవర్గం సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్ కిందకు వస్తున్నాయి, దీంతో ఒకే డివిజన్‌కు మూడు పదవులు ఇవ్వడం సరైన పద్ధతి కాదనే ఆలోచనతో కేసీఆర్ సోలిపేటను పక్కనపెట్టినట్లు తెలిసింది. ఇక మహిళా కోటాలో పద్మాదేవేందర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, ఆమెకు మహిళా, శిశు సంక్షేమశాఖ కేటాయించవచ్చని తొలుత ప్రచారం జరిగింది.
 
 కానీ సామాజిక వర్గాల సమీకరణ, ఇతర పరిణామాల నేపథ్యంలో బాబూమోహన్ పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు దళిత సామాజిక వర్గానికి చెందిన బాబూమోహన్... కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ బావ అంటే ‘బావ’అని సంభోదించుకుంటారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఆత్మీయులుగా మెలగగలిగారు. ఆ అభిమానంతోనే కేసీఆర్.. బాబూమోహన్‌ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి, అందోల్ సీటిచ్చారు. అంతేకాకుండా పట్టుబట్టి మరీ బాబూమోహన్‌ను గెలిపించుకున్నారు. తాజాగా మంత్రి పదవి కూడా బాబూమోహన్‌కే ఇవ్వడానికి కేసీఆర్ మొగ్గు చూపిన్నట్లు సమాచారం. బాబూమోహన్‌కు పదవి ఇవ్వటం వల్ల సామాజిక వర్గాల సమీకరణను కూడా సమతుల్యం చేసినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై బాబూమోహన్ స్పందన కోరగా..! ‘‘మా బావే సీఎం అవుతున్నప్పడు నాకు మంత్రి పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత’’ అంటూ సమాధానమిచ్చారు.
 

మరిన్ని వార్తలు