అనుమతి లేని కోచింగ్‌ సెంటర్లు సీజ్‌ 

10 Feb, 2018 18:16 IST|Sakshi
 వనపర్తిలో కోచింగ్‌ సెంటర్‌ను  సీజ్‌ చేస్తున్న ఎంఈఓ   

వనపర్తి విద్యావిభాగం : జిల్లాకేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న గురుకుల, నవోదయ కోచింగ్‌ సెంటర్లను శుక్రవారం ఎంఈఓ ఫయాజుద్దీన్‌ సీజ్‌ చేశారు. ఇటీవల జిల్లాలో అనుమతి లేని కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ సాధన సమితీ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.భరత్‌కుమార్‌  డీఈఓ సుశీందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లో అనుమతి లేని కోచింగ్‌ సెంటర్లను తనిఖీ చేసి సీజ్‌ చేయాలని ఎంఈఓలకు డీఈఓ ఆదేశించారు. దీంతో గత రెండు రోజులుగా కొత్తకోట, పెబ్బేరు మండలాల్లో ఎంఈఓలు తనిఖీలు నిర్వహించి కోచింగ్‌ సెంటర్లను సీజ్‌ చేశారు. దీంతో వనపర్తి పట్టణంలో కొనసాగుతున్న పలువురు కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు ముందుగానే  సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించారు. వనపర్తిలోని పలు కోచింగ్‌ కేంద్రాల్లో గద్వాల, అలంపూర్, శాంతినగర్, ఇటిక్యాల, కొల్లాపూర్, పాన్‌గల్‌ తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులను చేర్చుకోవడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి సొంత గ్రామాలకు పంపించారు. ఇందులో భాగంగా శుక్రవారం వనపర్తి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న జీటీ నారాయణ, జ్ఞానశ్రీ, జ్ఞానజ్యోతి, సాధన, సిందూజ, విక్టరీ కోచింగ్‌ సెంటర్లను ఎంఈఓ ఫయాజుద్దీన్‌ సీజ్‌ చేశారు. ఏ పోటీ పరీక్షలకైనా కోచింగ్‌ ఇచ్చే నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని కొనసాగించాలని ఎంఈఓ ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ సిబ్బంది రాధిక, సీఆర్పీ రవిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు