సీఎంది ఏకపక్ష నిర్ణయం..

11 Oct, 2018 02:07 IST|Sakshi

  ‘అసెంబ్లీ రద్దు’ వ్యాజ్యాలపై హైకోర్టులో పిటిషనర్ల న్యాయవాది

  అసెంబ్లీ రద్దుపై ముఖ్యమంత్రి సభ ఆమోదం కోరలేదు

  గవర్నర్‌ కేవలం రద్దు ఉత్తర్వులపై సంతకానికే పరిమితం

  వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు వాయిదా..  

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల కోసం 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణ, సిద్దిపేట జిల్లాకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి, ఆర్‌.అభిలాష్‌రెడ్డిలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ల ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.   పిటిషనర్ల తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది పి.నిరూప్‌రెడ్డి ధర్మాసనం వాదనలు వినిపించారు.  

గవర్నర్‌ ప్రేక్షక పాత్ర విస్మయకరం... 
అసెంబ్లీ రద్దు విషయంలో ముఖ్యమంత్రిది ఏకపక్ష నిర్ణయమని నిరూప్‌రెడ్డి వాదించారు. ఈ విషయంలో గవర్నర్‌ సైతం ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయకరమన్నారు.  సీఎం అసెంబ్లీ రద్దుపై సభ అభిప్రాయం, ఆమోదం కోరలేదని తెలిపారు. విచక్షణాధికారాలను ఉపయోగించాల్సిన గవర్నర్‌ కేవలం సభ రద్దు ఉత్తర్వులపై సంతకానికే పరిమితమయ్యారని వివరించారు. విచక్షణాధికారాల విషయంలో మార్గదర్శకాల నిమిత్తం దేశంలోని గవర్నర్లందరూ ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారని, ఆ కమిటీలో సదరు గవర్నర్‌ ఉన్నా.. తన విచక్షణాధికారాలను ఉపయోగించలేదన్నారు. 

హడావుడి ఎన్నికలు ఎందుకు: సభ రద్దు నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వల్ల 20 లక్షల మంది యువతకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిం దని నిరూప్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం హడావుడిగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల సంఘం చర్యల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. తప్పులకు ఆస్కారం లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయకుండా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.

రాష్ట్రంలో యువత ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న పార్టీపై వ్యతిరేకతో ఉన్నారని, అందుకే సీఎం ఉద్దేశపూర్వకంగా వారికి ఓటు హక్కు లేకుండా చేశారని వాదించారు. సీఎం రాజకీయ లబ్ధికి యువత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. ముఖ్య మంత్రి ప్రతి అడుగుకు ఎన్నికల సంఘం మడుగులొత్తుతోందన్నారు. పిటిషనర్ల తరఫు లాయర్‌ వాదనలపై సీఈసీ తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు తమను నిందించడం భావ్యం కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  

మరిన్ని వార్తలు