జిల్లాకు ఉద్యానవన యూనివర్సిటీ మంజూరు

10 Jul, 2014 23:49 IST|Sakshi

 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక బడ్జెట్‌పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఆదాయ పన్ను పరిమితి రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచి సగటు ఉద్యోగికి కొంత ఊరట కలిగించినప్పటికీ.. ఇతర అంశాలను పరిగణిస్తే పెద్దగా ఒరిగిందేమీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని నగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉద్యాన సాగును భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో రాష్ట్రానికి ఉద్యానవన యూనివర్సిటీ మంజూరు చేసింది. ఈ క్రమంలో యూనివర్సిటీ ఏర్పాటు ప్రభావంతో జిల్లాలో తలపెట్టాలనుకున్న ప్రత్యేక హార్ట్టీకల్చర్ జోన్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులను కేటాయించింది. దీంతో రాజధానికి వెళ్లే అన్నీ ప్రధాన రహదారులు జిల్లాలో ఉండడంతో ఆయా రోడ్ల పరిస్థితి మెరుగుపడనుంది.  మరోవైపు ఇనుము, సిమెంటు ధరలు తగ్గనున్నాయి. దీంతో జిల్లాలో నిర్మాణరంగం ఊపందుకుని కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

మరిన్ని వార్తలు