ప్రాథమిక అవస్థ కేంద్రాలు

2 Nov, 2019 10:48 IST|Sakshi

రోగులు ఓ చోట.. హెల్త్‌ సెంటర్లు మరోచోట  

ఇష్టానుసారంగా యూపీహెచ్‌సీల ఏర్పాటు  

బోధన, ఏరియా ఆస్పత్రుల భవనాల్లో నిర్వహణ  

ఒకే భవనంలో రెండింటితో నిష్ప్రయోజనం  

స్థానికంగా అందుబాటులోలేకపోవడంతో ప్రజలకుఇబ్బందులు  

సాక్షి, సిటీబ్యూరో: పుండు ఒకచోట ఉంటే.. మందు మరోచోట రాస్తే ఫలితం ఎలా ఉంటుంది? నగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్‌సీ) పరిస్థితి ఇలాగే ఉంది. రోగులు ఒక ప్రాంతంలో ఉంటే... ఆరోగ్య కేంద్రాలను మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. వాంతులు,విరేచనాలు, దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి సాధారణ చికిత్సలకూ ప్రజలు పెద్దాస్పత్రులను ఆశ్రయించాల్సి
వస్తోంది. హైదరాబాద్‌ జిల్లా వైద్యా85 యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. కాలనీలు, బస్తీలు, ఏరియాలతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వీటిని ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బోధన, ఏరియా ఆస్పత్రుల భవనాల్లోనే వీటిని నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడికి రోగులు రాకపోగా.. ఆయా ఆస్పత్రుల నిర్వహణ జిల్లా వైద్యారోగ్య శాఖకు భారమవుతోంది. మరోవైపు ఇక్కడికి వచ్చే బాధితులకు పెద్దాస్పత్రి సిబ్బంది వైద్యం అందిస్తుండగా... ఈ కేంద్రాల్లోని సిబ్బంది కేవలం బుధ, శనివారాల్లో నిర్వహించే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

ఒకేదాంట్లో రెండు..  
గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు బోధనాస్పత్రుల్లో యూపీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. నాంపల్లి ఏరియా ఆస్పత్రిలోనూ యూపీహెచ్‌సీ ఉండగా... దూద్‌బౌలి, పురానాపూల్‌–2 యూపీహెచ్‌సీలు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. దీంతో ఏ బస్తీ రోగులకు ఏ ఆరోగ్య కేంద్రంలో సేవలు అందుతున్నాయో తెలియని పరిస్థితి. విద్యానగర్‌లోని ఏఎంఎస్‌ ఆస్పత్రిలో అదే పేరుతో మరో యూపీహెచ్‌సీ, బార్కాస్‌ ప్రభుత్వ హెల్త్‌ సెంటర్‌లో బార్కాస్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి ప్రాంగణంలో తిలక్‌నగర్‌ యూపీహెచ్‌సీ, ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిలోనూ మరో యూపీహెచ్‌సీ కొనసాగుతున్నాయి. యూపీహెచ్‌సీల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలు లేకపోవడం, కమ్యూనిటీ హాళ్లను ఇచ్చేందుకు ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు నిరాకరిస్తుండడంతో బోధన, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఆయా బస్తీలు, కాలనీల్లోని రోగులకు సమీపంలోని ఏరియా, బోధనాస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. అదే ప్రాంగణంలో అదనంగా యూపీహెచ్‌సీని కొనసాగించడం వల్ల ప్రయోజనమేమిటని వైద్యనిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

జీహెచ్‌ఎంసీకి లేఖ రాశాం  
రోగులు ఒకచోట ఉంటే ఆస్పత్రులు మరోచోట ఉన్న మాట నిజమే. భవనాల కొరత వల్లే ఇలా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఒకే భవనంలో రెండు ఆస్పత్రులు నిర్వహించడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. రెండు ఆస్పత్రుల సిబ్బందిలో ఎవరు పని చేస్తున్నారో తెలియడం లేదు. సిబ్బంది పర్యవేక్షణ కూడా కష్టమవుతోంది. వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ రాశాం. వార్డుల వారీగా ఏదైనా ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్‌ను గుర్తించి అప్పగించాలని కోరాం. అవసరం లేని చోటు నుంచి యూపీహెచ్‌సీలను తరలించి అవసరమైన చోట ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు రావడంతో పాటు సిబ్బంది కొరత సమస్య కూడా తీరుతుంది.   – డాక్టర్‌ వెంకటి, వైద్యారోగ్యశాఖఅధికారి, హైదరాబాద్‌ జిల్లా  

 ఏరియా ఆస్పత్రుల్లో వైద్యం ఇలా... 
ఏరియా ఆస్పత్రులు: కింగ్‌కోఠి, కొండాపూర్, గోల్కొండ, నాంపల్లి, వనస్థలిపురం, సురాజ్‌బాన్‌ (పాతబస్తీ)తప్పనిసరి ఉండాల్సిన విభాగాలు: గైనకాలజీ, జనరల్‌ సర్జన్, జనరల్‌ ఫిజీషియన్, పీడియాట్రిషియన్, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, రేడియాలజీ
ఒక్కో ఏరియా ఆస్పత్రికి రోజుకు సగటున వస్తున్న రోగులు 400మంది
వీరిలో గర్భిణులు సుమారు 200 మంది
ప్రాథమిక వైద్యం కోసం వచ్చేవారు 70–80 శాతం  
ప్రస్తుతం పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు 250 మంది   
ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు 15   

హైదరాబాద్‌ జిల్లాలో ఇలా..
మొత్తం యూపీహెచ్‌సీలు 85
అర్బన్‌ న్యూట్రిషన్‌ హెల్త్‌ క్లస్టర్లు 14
వీటిలో 24 గంటల పాటు పని చేసేవి 9 (దారుషిఫా,యాకుత్‌పురా,హర్రజ్‌పెంట, పురానాపూల్‌–1, బేగంబజార్, చింతల్‌బస్తీ, గగన్‌మహల్, బోరబండ,పాన్‌బజార్‌)
అంతర్జాతీయప్రమాణాల మేరకు ప్రతి వెయ్యి మందికి ఒక్క డాక్టర్‌ చొప్పున ఉండాలి. కానీనగరంలో ప్రతి 10వేల మందికి ఒకరు చొప్పున ఉన్నారు.  
ప్రతి 10వేల మందికి ఒక నర్సు ఉండాలి. కానీ ప్రస్తుతం సిటీలో 30వేల మందికి ఒకరు చొప్పున ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు