గేమ్స్‌తో సామాజిక చైతన్యం

26 Jul, 2019 01:43 IST|Sakshi
‘గేమ్స్‌ ఫర్‌ గుడ్‌’ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న హడ్డా

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజా జీవనాన్ని ప్రభావితం చేసేలా, సామాజిక చైతన్యాన్ని పెంచేలా ఆధునిక పద్ధతిలో గేమ్స్‌ రూపొందించాలని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని టీహబ్‌లో 4 రోజులపాటు జరగనున్న ‘గేమ్స్‌ ఫర్‌ గుడ్‌’కార్యక్రమాన్ని ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో కలసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గేమింగ్‌ కోసం కార్యక్రమం నిర్వహించడం 30 ఏళ్ల అమెరికన్‌ కాన్సులేట్‌ చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు. ‘గేమ్స్‌ ఫర్‌ గుడ్‌’మంచి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. స్మార్ట్‌ఫోన్లు పెరుగుతున్న దరిమిలా అంతర్జాతీయంగా గేమింగ్‌కు చక్కటి ఆదరణ ఏర్పడిందన్నారు. సామాజిక మార్పుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

ప్రపంచాన్ని వేధిస్తోన్న శరణార్థులు, వాతావరణ మార్పులు, మానవ అక్రమ రవాణా, వ్యాధులు తదితర సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం పెంచేలా గేమ్స్‌ ఉండాలని సూచించారు. వినోదం, సృజనాత్మకతతోపాటు సామాజిక చైతన్యానికి గేమింగ్‌ రంగం చక్కటి వేదిక కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల సంస్కృతి, సంబంధాలను పెంపొందించేలా గేమ్‌లు రూపొందించాలని యువ గేమ్‌ డిజైనర్లకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం చాలా సంతోషకరమని, ఇక్కడ అత్యున్నత విద్యాసంస్థలకు తోడు అమెరికాకు చెందిన 130 కంపెనీలు ఉన్నాయని గుర్తు చేశారు. టీ హబ్‌ అద్భుతాలకు చిరునామాగా.. నూతన ఆవిష్కరణలకు నిలయంగా మారిందని ప్రశంసించారు. 

భారత సవాళ్లను దృష్టిలో ఉంచుకోండి
‘భారత్‌ చాలా వైవిధ్యమున్న దేశం. ఇక్కడి జీవనశైలి, ఆచార వ్యవహారాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని గేమ్‌లు రూపొందించాలి. భారతీయులు ఇంటిని అత్యంత పరిశుభ్రంగా ఉంచుకుంటారు. కానీ బయటికెళ్లగానే ఆ విషయాన్ని మర్చిపోతారు. ఇక్కడి ప్రభుత్వాలు పారిశుద్ధ్యం కోసం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నాయి. నీటి ఎద్దడి, పర్యావరణంపై చైతన్యం పెంచేలా గేమ్స్‌ ఉండాలి. గేమింగ్‌ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. డిజిటల్‌ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతూ.. 20 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటిదాకా హైదరాబాద్‌ కంపెనీలు విదేశీ గేమ్‌ల రూపకల్పన కోసం పనిచేశాయి. గత రెండు, మూడేళ్లుగా ఆ పరిస్థితిలో మార్పువచ్చి.. మనవాళ్లే కొత్త పాత్రలు రూపొందిస్తున్నారు. చోటా భీమ్, బాహుబలి పాత్రలకు ప్రాణం పోసి వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా నిలవడమే దీనికి నిదర్శనం. యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్‌లోనూ హైదరాబాద్‌ ఇప్పటికే తన ఘనతను చాటుకుంది’అని హడ్డా వెల్లడించారు. అంతకుముందు కార్యక్రమంలో గేమింగ్‌ నిపుణులు శాన్‌ బుచర్డ్, విజయ్‌ లక్ష్మణ్, కవితా వేమూరి తదితరులు పాల్గొని ప్రసంగించారు.  

మరిన్ని వార్తలు