బంగాళాఖాతంలో అల్పపీడనం 

1 Jul, 2019 02:59 IST|Sakshi

నేడు, రేపు ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు

గత నెల రాష్ట్రవ్యాప్తంగా 35 శాతం లోటు వర్షపాతం 

సాక్షి, హైదరాబాద్‌: ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది తీవ్రంగా మారి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో సోమవారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మంగళవారం కొన్నిచోట్ల భారీ వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు.   గత 24 గంటల్లో దుండిగల్‌లో 6 సెంటీమీటర్లు, గజ్వేల్, బజర్హతనూర్, తూప్రాన్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున, ధర్మసాగర్, నర్మెట్ట, వర్నిలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 

హైదరాబాద్‌లో 11 శాతం అధిక వర్షపాతం 
జూన్‌లో హైదరాబాద్‌లో 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ నెల రోజుల్లో 105.6 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షం కురవాల్సి ఉండగా 116.9 ఎంఎం కురిసింది. కరీంనగర్‌ జిల్లాలో ఆరు శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో సరాసరి 132 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా 86.2 ఎంఎం కురిసింది. ఖమ్మం జిల్లాలో మాత్రం ఏకంగా 73 శాతం లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం. జిల్లాలో గత నెల రోజుల్లో సాధారణంగా 130.5 ఎంఎం మేర వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 35.2 ఎం.ఎం. మాత్రమే నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 

మరిన్ని వార్తలు