బాధితులకు పునరావాసం కల్పించాల్సిందే

20 Jun, 2018 02:30 IST|Sakshi

భూసేకరణ ప్రభావిత కుటుంబాలకు సాయం అందకపోవడంపై  హైకోర్టు స్పందన

నోటీసులు జారీ.. విచారణ మూడు వారాలకు వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌), కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులకోసం వేల ఎకరా ల భూములు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ భూసేకరణ వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాలకు చట్ట ప్రకారం కల్పించాల్సిన ప్రయోజనాలను కల్పించడం లేదంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల కలెక్టర్లు తదితరులకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభావిత కుటుంబాలను గుర్తించే ప్రక్రియను నామమాత్రపు తంతుగా అధికారులు ముగిస్తున్నారని, ప్రభావిత కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ, పాలమూరు వలస కార్మికుల సంఘం అధ్యక్షుడు పి.నారాయణస్వామి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది శశికిరణ్‌ వాదనలు వినిపిస్తూ, పీఆర్‌ఎల్‌ఐఎస్, కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం ఇప్పటికే వేల ఎకరాలను సేకరించారని, ఇంకా వేల ఎకరాలను సేకరించాల్సి ఉందన్నారు. అయితే 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఆ భూములపై ఆధారపడి జీవించే ప్రభావిత కుటుంబాలైన రైతు కూలీలు, ఇతరులకు ఎటువంటి ప్రయోజనాలను వర్తింపచేయడం లేదన్నారు. వారిని గుర్తించే ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని తెలిపారు. కమిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. పీఆర్‌ఎల్‌ఐఎస్‌ కింద 20వేల ఎకరాలకు పైగా సేకరించిన ప్రభుత్వం, ఓ మండలంలో కేవలం 112 మంది మాత్రమే ప్రభావిత వ్యక్తులు ఉన్నట్లు తేల్చిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

మిగిలిన మండలాల్లో ఒక్కరిని కూడా ప్రభావిత కుటుంబాల కింద గుర్తించలేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘మీ (పిటిషనర్‌) ప్రకారం అర్హులైన ప్రభావిత కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, మండలానికి కనీసం 10–15 మంది వివరాలనైనా మా దృష్టికి తీసుకురండి. వాటి ఆధారంగా మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. నూతన చట్టం ప్రకారం ప్రభావిత కుటుంబాలకు పునరావాసం, పునర్నిర్మాణం కల్పించి తీరాల్సిందే’ అని వ్యాఖ్యానించింది. దీనికి శశికిరణ్‌ సానుకూలంగా స్పందిస్తూ, ప్రభావిత వ్యక్తుల వివరాలను సమర్పించేందుకు గడువు కోరారు. ప్రభావిత వ్యక్తులు ఎంత మంది ఉన్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని కూడా ధర్మాసనం ఆదేశించింది.

మరిన్ని వార్తలు