నాలుగు డెయిరీలతో ‘విజయ బోర్డు’

18 Jul, 2018 03:10 IST|Sakshi

ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలు 

విజయ డెయిరీ పేరుతోనే ఉత్పత్తులు 

ప్రతిపాదనలు పంపాలని డెయిరీలకు సూచన 

విజయ డెయిరీని మార్కెటింగ్‌ ఫెడరేషన్‌గా మార్చే కసరత్తు 

ఎండీగా ప్రైవేటు నిపుణుడిని నియమించే యోచన 

ప్రైవేటు దిశగా సర్కారు అడుగులు?

సాక్షి, హైదరాబాద్‌: విజయ డెయిరీ ఫెడరేషన్‌లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. విజయ డెయిరీ ఆధ్వర్యంలో నల్లగొండ–రంగారెడ్డి సహకార డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్‌ డెయిరీల భాగస్వామ్యంతో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం సహకార డెయిరీల ప్రతినిధులు కొందరు ప్రభుత్వంలోని ఓ కీలక ఉన్నతాధికారితో సమావేశమై చర్చించారు. ప్రతిపాదనలు తయారు చేసుకుని తీసుకురావాలని, వాటిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని ఆ ఉన్నతాధికారి చెప్పినట్లు ఓ సహకార డెయిరీ చైర్మన్‌ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతిపాదనలు తయారు చేసే పనిలో తాము నిమగ్నమైనట్లు ఆయన వెల్లడించారు. ‘ఈ 4 డెయిరీలతో బోర్డు ఏర్పాటైతే, సహకార డెయిరీల చైర్మన్లంతా సభ్యులుగా ఉంటారు. ఆయా డెయిరీ సొసైటీలతో కలుపుకుని బోర్డుకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారే విజయ డెయి రీ భాగస్వామ్య బోర్డుకు చైర్మన్‌గా ఉంటారు’అని తెలిపారు. 

కొత్త మార్కెట్‌ కోసమే 
ఈ నాలుగు డెయిరీలకు 2.13 లక్షల మంది రైతులు పాలు పోస్తుంటారు. విజయ డెయిరీకి రోజుకు 3.5 లక్షల లీటర్ల నుంచి 4 లక్షల లీటర్ల వరకు పాలు వస్తుంటాయి. కానీ 2 లక్షల నుంచి 2.5 లక్షల లీటర్లే అమ్ముడవుతున్నాయి. నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ విక్రయాలు రోజుకు లక్ష లీటర్లు ఉండగా, 35 వేల లీటర్ల వరకు పాలు మిగులుతున్నాయి. కరీంనగర్‌ డెయిరీ విక్రయాలు లక్షన్నర లీటర్లు ఉండగా, కొంత వరకు మిగులుతున్నాయి. ముల్కనూరు డెయిరీ విక్రయాలు 60 వేల లీటర్లు ఉన్నాయి. ఇలా ఈ డెయిరీల్లోనూ పాలు మిగులుతున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం సబ్సిడీపై 2.13 లక్షల పాడి గేదెలను పంపిణీ చేస్తే మరో 15 లక్షల లీటర్ల వరకు అదనపు పాలు వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కొత్త మార్కెట్‌ను సృష్టించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ నాలుగు డెయిరీలు ఒకే గొడుగు కిందికి రావాలని ఈ ప్రతిపాదనలు తెస్తున్నట్లు చెబుతున్నారు.  

తాజా పాలు నినాదంతో.. 
ఇతర రాష్ట్రాల పాలు చౌకగా హైదరాబాద్‌ మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిపై సెస్‌ విధిం చేలా ప్రతిపాదనలు తయారు చేస్తారని సమా చారం. ‘అమూల్‌ పాలు గుజరాత్‌ నుంచి వస్తున్నాయి. సేకరించిన వారం రోజుల తర్వాత అవి రాష్ట్ర వినియోగదారులకు చేరుతుంది. కాబట్టి అవి తాజా పాలు కావు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వాటికి కూడా మూడు రోజులు తేడా ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే పాలు 24 గంటల తేడాతో ఉంటాయి. కాబట్టి ‘తాజా పాలు’నినాదంతో ముందుకు వెళ్లాలి’అని యోచిస్తున్నట్లు తెలిసింది. మిగిలిపోయిన పాలతో పాలకోవ, వెన్న, నెయ్యి తదితర ఉత్పత్తులను తయారు చేసి విజయ డెయిరీ పేరుతోనే ప్యాకింగ్‌ చేస్తామని, విజయ డెయిరీ ఆధ్వర్యంలో అమ్మకాలు చేస్తామని ఆ సహకార డెయిరీ చైర్మన్‌ చెబుతున్నారు. విజయ డెయిరీ ఫెడరేషన్‌ను ‘విజయ డెయిరీ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌’గా పేరు మార్చాలని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం విజయ డెయిరీలోని నిబం ధనలను మార్చాలని కోరుతున్నామన్నారు. 

ఎండీగా ఐఏఎస్‌ వద్దు 
కొత్తగా ఏర్పాటయ్యే విజయ డెయిరీ మార్కె టింగ్‌ ఫెడరేషన్‌ బోర్డుకు చైర్మన్‌ను డెయిరీల్లోని సొసైటీ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ ప్రకారం నాలుగు డెయిరీల్లోని వారిలో ఎవరో ఒకరు చైర్మన్‌ అవుతారు. ప్రస్తుతం ఉన్నట్లుగా ఐఏఎస్‌ను మాత్రం ఎండీగా నియమించకూడదని ప్రతిపాదనల్లో ఒక అంశంగా చేర్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. పాల ఉత్పత్తి రంగంలో అత్యంత అనుభవజ్ఞులైన జాతీయ స్థాయి వ్యక్తిని తీసుకోవాలనేది భావిస్తున్నట్లు తెలిసింది. పాల పొడి, వెన్న, నెయ్యి తదితరాలు తయారు చేసే ప్లాంటు రాష్ట్రంలో లేకపోవడంతో ఏపీకి వెళ్లాల్సి వస్తోందని, దీంతో ఇక్కడే ఒక ప్లాంటును నెలకొల్పాలని తాము ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని ఆ సహకార డెయిరీ చైర్మన్‌ చెబుతున్నారు. 

ప్రైవేటు దిశగా అడుగులా? 
ప్రసుత్తమున్న సహకార సొసైటీలకు తోడు పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్‌ల్లోని పాల సొసైటీలతో ఒక యూనియన్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలతో కలిపి మరో యూనియన్, మహబూబ్‌నగర్‌ జిల్లాతో కలిపి మరో యూనియన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంటే విజయ డెయిరీ, మూడు సహకార డెయిరీలు, కొత్తగా మరో మూడు యూనియన్ల భాగస్వామ్యంతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలనేది తాజా ప్రతిపాదనల్లో ఒక కీలక అంశం. విజయ డెయిరీ ఇప్పటికే పూర్తిస్థాయిలో నష్టాల్లో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అది నిర్వీర్యమైంది. ఇప్పుడు తాజాగా ఇతర సహకార డెయిరీలు తీసుకునే విధానాలు ఏ మేరకు దాన్ని బాగు చేస్తాయోనన్న చర్చ జరుగుతోంది. ప్రైవేటు దిశగా విజయ డెయిరీలో అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు