అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

6 May, 2018 10:23 IST|Sakshi
 మహిళలకు చెక్కు అందజేస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి పథకం

ప్రతి కుటుంబానికి వంటగ్యాస్‌ కనెక్షన్‌

మహిళా సంఘాలకు రూ.21.46 కోట్ల రుణాలు

రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

మొయినాబాద్‌(చేవెళ్ల) : గ్రామాల అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు వందశాతం అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 4 గ్రామాల్లో అమలు చేసిన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా మొయినాబాద్‌ మండలం చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పొగలేని గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వంటగ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తుందన్నారు. రేషన్‌ కార్డులతో సంబందం లేకుండా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు.

గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ పథకం కింద జిల్లాలోని నాగిరెడ్డిగూడ, గోపులారం, ముకునూర్, లింగారావుపల్లి గ్రామాలను ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో వంటగ్యాస్‌ కనెక్షన్లు, విద్యుత్‌ కనెక్షన్లు, ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీ చేయడంతోపాటు ప్రతి ఇంటికి ఎల్‌ఈడీ బల్బులు అందజేసినట్టు చెప్పారు. నాలుగు గ్రామాల్లోనే కాకుండా త్వరలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. అదే విధంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో మహిళలు భాగస్వాములు కావాలన్నారు.

మహిళా సంఘాలకు రూ.21.46 కోట్ల బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలు అందజేస్తామన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ యువకులకు ఉపాధి కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మొయినాబాద్‌ మండలంలోని 6 మంది రైతులకు ట్రాక్టర్లు, ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా ఉపాధి కోసం కార్లు, ఇతర సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యా దయ్య, స్థానిక సర్పంచ్‌ గున్నాల సంగీత, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, వైస్‌ఎంపీపీ పద్మమ్మ, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాటి జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, జెడ్పీ సీఈఓ రాజేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ప్రశాంత్‌కుమార్, ఏపీడీ ఉమారాణి, ఎంపీడీఓ సుభాషిణి, తహసీల్దార్‌ నాగయ్య, ఎంపీటీసీ పెంటయ్య, సర్పంచ్‌లు కలిశెట్టి సంధ్య, మల్లేష్‌యాదవ్, సుధాకర్‌యాదవ్, బాలమణి, ఉపసర్పంచ్‌ నర్సింహగౌడ్, నాయకులు సంగెరి మల్లేష్, శ్రీహరి, గున్నాల గోపాల్‌రెడ్డి, బాల్‌రాజ్, జయవంత్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు