కాజీపేటలో వ్యాగన్‌  ఓవరాలింగ్‌ ఫ్యాక్టరీ!

13 Mar, 2018 03:36 IST|Sakshi

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి బదులుగా ఏర్పాటు చేస్తామన్న కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం ప్రకారం తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి బదులు కాజీపేటలో వ్యాగన్‌ పిరియాడికల్‌ ఓవరాలింగ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 13లో పేర్కొన్న సంస్థల ఏర్పాటుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబా, సంయుక్త కార్యదర్శి ప్రసాద్, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు సోమవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో చర్చించారు. దీనికి రాష్ట్రం నుంచి పలువురు ఉన్నతాధికారులు, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్‌ హాజరయ్యారు. పిరియాడికల్‌ ఓవరాలింగ్‌ ఫ్యాక్టరీకి 160 ఎకరాల స్థలం అవసరమవుతుందని సమావేశం నిర్ధారించింది.

బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై తర్వాత నిర్ణయం 
ఇక ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లను అనుసంధానం చేస్తూ బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై అధ్యయనం జరిపాక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇక హార్టికల్చర్, గిరిజన వర్సిటీల ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాలకు రహదారుల అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200 ఎకరాల స్థలం కేటాయించినట్లు  అధికారులు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం 500 ఎకరాలు కోరడంతో మిగిలిన స్థలం కింద అటవీ భూములు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్‌ 13లోని సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇక ఏపీలో గిరిజన, సెంట్రల్‌ వర్సిటీల ఏర్పాటుకు క్యాబినెట్‌ నోట్‌ పూర్తైనట్లు ఆ రాష్ట్ర సీఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు