దేవుడోలె ఆదుకుంటారని..

5 Nov, 2014 02:16 IST|Sakshi
దేవుడోలె ఆదుకుంటారని..

కష్టాలు లేని, రాని మనిషులుంటారా..? కచ్చితంగా ఉండరు. కానీ కక్షకట్టి దాడిచేసినట్టు.. ఒకదాని తర్వాత ఒకటిగా మీదనొచ్చి పడితే తట్టుకోవడం సాధ్యమా.. ఎంతమాత్రమూ కాదు. అందులోనూ ఖరీదైన జబ్బుల రూపంలో వచ్చి పట్టిపీడిస్తే..? అదీ రోజుకూలి చేసుకుని బతుకుబండిని లాగే పేదలైతే.. నిత్యం నరకమే. కానీ ఇదే జరిగింది ఉప్పలయ్యకు.. ఒకదాన్నుంచి తెరిపి లభించిందనుకునేలోపే.. మరొటి.. ఆ వెంటనే ఇంకోటి. తట్టుకోలేకపోయాడు.

చివరికి మంచం పట్టాడు. పాపం చిన్నారి రుషికేష్‌కూ అంతే. ఆడిపాడాల్సిన వయసులో.. ముద్దుముద్దు మాటలతో ఇంట్లో నవ్వులు పూయించాల్సిన చిరుప్రాయంలో తలసేమియాతో మంచానికే పరిమితమయ్యాడు. సాధ్యమా.. వీరిని చూస్తూ తట్టుకోవడం సాధ్యమా.. దేవుడిలా వచ్చి దాతలు ఆదుకుంటారని, ఆపన్నహస్తం అందించి ఆదుకుంటారని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి ఈ విధివంచిత కుటుంబాలు.
 
తలసేమియాతో తల్లడిల్లుతున్న బాలుడు
మహబూబాబాద్ : మానుకోటకు చెందిన బొడ్డుపెల్లి ఉపేందర్, అరుణ దంపతులది నిరుపేద కుటుంబం. ఉపేందర్ హోంగార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఆరున్నరేళ్ల క్రితం కుమారుడు రుషికేష్ జన్మించడంతో సంబరపడిపోయారు. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. పుట్టిన కొన్ని రోజులకే బాబుకు అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది గుండెలు పిండేసే విషయం.

చిన్నారి తలసేమియాతో బాధపడుతున్నాడని, నెలలో రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో బోరున విలపించారు. బాబును బతికించుకునేందుకు హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడి రెడ్‌క్రాస్ సొసైటీలో ఉచితంగా రక్తాన్ని ఇస్తున్నారు. అయితే మందులు, రవాణా చార్జీలు కలిపి ప్రతినెల ఐదువేల రూపాయల వరకు అవుతున్నాయని ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు విధులకు హాజరుకాకుంటే వేతనంలో కోత పెడుతున్నారని వాపోతున్నాడు. వస్తున్న వేతనం బాలుడి వైద్యానికే ఖర్చవుతుండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కన్నీరు పెట్టుకున్నాడు.

మంచానికే పరిమితం
రోజులు గడుస్తున్న కొద్దీ రుషికేష్ ఆరోగ్యం క్షీణిస్తోంది. బాలుడి తల్లి నిత్యం దగ్గరుండి సేవలందిస్తున్నా పరిస్థితిలో మా త్రం ఇసుమంతైనా మార్పులేదు. ఇంట్లో చెంగుచెంగున ఎగురుతూ సందడి చేయాల్సిన కొడుకు ఇలా మంచానికే పరిమితమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మద్రాసులోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో రుషికేష్‌కు బోన్‌మారో ఆపరేషన్ చేయిస్తే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు అవకాశం ఉందని, ఇందుకు రూ.25లక్షలకు పైగా ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక అల్లాడిపోతున్నారు.

డబ్బులు సమకూర్చుకునేందుకు ఏడాది కాలంగా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతి ఒక్కరిని చేతులు జోడించి అర్థిస్తున్నా రు. తమకు ఏ ఆధారం లేకపోవడంతో అప్పు ఇచ్చేందుకు అందరూ వెనుకాడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పేదోళ్లకి ఖరీదైన జబ్బు రాకూడదంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు