వరంగల్‌లో ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

1 Oct, 2019 10:29 IST|Sakshi
కేంద్ర మంత్రి సంతోష్‌గంగ్వార్‌ను సన్మానిస్తున్న చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం

కేంద్ర కార్మిక శాఖ సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌

నగరంలో సంపర్క్‌ అభియాన్, జనజాగరణ సభలు

దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ అన్నారు. సంపర్క్‌ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు.     

సాక్షి, న్యూశాయంపేట: దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ అన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంపర్క్‌ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా హన్మకొండ రాంనగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సంపర్క్‌ అభియాన్, జనజాగరణ సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలో వచ్చిన వందరోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజామోదం లభించిందని చెప్పారు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని ఇందులో వేరే దేశం జోక్యాన్ని సహించేది లేదన్నారు.

కశ్మీర్‌తో పాటు, దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ రాబోయే రోజుల్లో అధికారంలో వస్తుందని, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలచుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు.  పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని, కలిసికట్టుగా పనిచేసి టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం  కేంద్రమంత్రికి మెమోరండం సమర్పించింది. సంపర్క్‌ అభియాన్‌ భాగంగా కాకతీయ మాజీ వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వంగాల గోపాల్‌రెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు  దిడ్డి కుమారస్వామి, ప్రముఖ కవి రచయిత ప్రొఫెసర్‌ రామాచంద్రమౌళిలను కలుసుకున్నారు. సభలో రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్‌ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ అర్బన్, రూరల్‌జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు డాక్టర్‌ విజయలక్ష్మి, రావుల కిషన్, మల్లాది తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలి
చారిత్రాత్మకమైన వరంగల్‌ జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కోసం భారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిని కోరారు. గతంలో ఉన్న ఆజంజాహి మిల్లు మూత పడడంతో వేలాది మందికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆసియాలోనే పెద్ద మార్కెట్‌ ఉన్న వరంగల్‌లో స్పైసెస్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని, ఉన్న స్పైసెస్‌ బోర్డును తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు సాధుల దామోదర్, తోట నర్సింహరావు, కొత్త కిషోర్‌కుమార్, సారయ్య, గౌరిశెట్టి శ్రీనివాస్, రాజు, దేశబత్తుల రమేష్, పోతుకుమారస్వామి,  బిజెపీ నాయకులు రావు పద్మారెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి,  గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, వన్నాల శ్రీరాములు, వంగాల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మోదీ పాలనకు మద్దతుగా నిలవాలి
వరంగల్‌: దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ పాలనకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ అన్నారు. వరంగల్‌లోని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో సోమవారం వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అర్టికల్‌ 371ను రద్దు చేసి కాశ్మీర్‌ ప్రజలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాలపై ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సంపర్క్‌ అభియాన్, జనజాగరణ్‌ కార్యక్రమాలు నిర్విహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా వరంగల్‌ పట్టణంలో మేధావులను, కవులను, వ్యాపార, వాణిజ్య వర్గాలను కలుసుకున్నామని చెప్పారు.  

మరిన్ని వార్తలు