ఇంత నిర్లక్ష్యమా!

24 Dec, 2015 01:32 IST|Sakshi

రోడ్ల పనుల్లో ఏడో స్థానంలో వరంగల్
మీ జిల్లాకు నష్టం చేస్తున్నారు
అధికారులపై ఈఎన్‌సీ ఆగ్రహం
కాంట్రాక్టర్ల తీరుపైనా అసంతృప్తి
మార్చిలోపు పూర్తి చేయాలని ఆదేశం
పంచాయతీరాజ్ రోడ్లపై సమీక్ష

 
వరంగల్ : పంచాయతీరాజ్ రోడ్ల పనులు జరుగుతున్న తీరుపై ఈ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) ఎం.సత్యనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్ల నిర్మాణం విషయంలో జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజనీర్లు అలసత్వం చూపుతున్నారని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పనితీరు లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి  విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన కొత్త రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులపై పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఈఈ), డివిజనల్ ఇంజనీర్లు(డీఈ)లు, సహాయ ఇంజనీర్లు(ఏఈ), కాంట్రాక్టర్లతో ఈఎన్‌సీ ఎం.సత్యనారాయణరెడ్డి జిల్లా పరిషత్ సమావేశమందిరంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీరాజ్ శాఖ గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా రోడ్ల నిర్మా ణం, పునరుద్ధరించేందుకు రూ.416 కోట్లు మంజూరు చేసిందని వివరించారు.

రోడ్ల పనులను పూర్తి చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రోడ్లు పనులను పూర్తి చేసే విషయంలో వరంగల్ జిల్లా రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉందని  అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అనుభవం గల పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారని, 22 హాట్ మిక్స్ ప్లాంట్లు ఉన్నా.. రోడ్ల పనులు జరిగే తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదన్నారు. పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లాలోని రూ. 230.35 కోట్లతో 1676.37 కిలో మీటర్ల పొడవైన బీటీ రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణరుుంచిందని, రూ. 185.71 కోట్లతో 396.83 కిలో మీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేయనుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 484 కిలో మీటర్ల రోడ్లనే పునరుద్ధించారని, కేవలం 57 కిలో మీటర్ల మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చారని పేర్కొన్నారు. ఇంత అధ్వాన్నంగా పనులు జరిగితే ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. ఇంజ నీరింగ్ అధికారులు అలసత్వం వీడాలని... క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పరిశీలించాలని ఆదేశించారు. కాం ట్రాక్టర్లు త్వరగా పనులు పూర్తి చేసేందుకు వీలుగా ఇంజనీర్లు ప్రయత్నించాలని, వెంటవెంటనే రికార్డులు నమోదు చేయాలన్నా రు. ‘రోడ్ల పనులను త్వరగా పూర్తి చేస్తేనే ప్రభుత్వం కొత్తగా పనులను మంజూరు చేస్తుంది. వరంగల్‌లో ఎక్కువ మంది ఇంజనీర్లు సొం త జిల్లా వారే ఉన్నారు. ప్రస్తుత పనులు త్వరగా పూర్తి చేయించకపోతే జిల్లాకు కొత్త పనులు వచ్చే అవకాశం ఉండదు. మీ నిర్లక్ష్యంతో మీ జిల్లాకే నష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి’ అని అన్నారు. పనులను త్వరగా పూర్తి చేయించలేని వారిపై శాఖపరంగా చర్యలు తీసుకుంటామని ఈఎన్‌సీ హెచ్చరించారు.
 
కాంట్రాక్టర్లూ.. ఆలస్యం వద్దు
 పంచాయతీరాజ్ రోడ్ల పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఈఎన్‌సీ సత్యనారాయణరెడ్డి కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కాంట్రాక్టర్ల సమస్యలను ఏవైనా ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, పనులను ఆల స్యం చేస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బిల్లుల మంజూరు విషయంలో గతంలో బాగా ఆలస్యమయ్యేదని, ఇప్పుడు గరిష్టంగా మూడు నెలల్లోనే బిల్లులు ఇస్తున్నామన్నారు. బిల్లుల మంజూ రు, రికార్డుల నమోదు, అంచనా వ్యయం విషయాల్లో ఇంజనీర్ల తీరు సరిగా లేదని పలువురు కాంట్రాక్టర్లు ఈఎన్‌సీకి ఫిర్యాదు చేశారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని, మార్చిలోపు రోడ్ల పనులను పూర్తి చేయాలని ఈఎన్‌సీ చెప్పారు.

 29న ముఖ్యకార్యదర్శి సమీక్ష
 పంచాయతీరాజ్ శాఖ రోడ్ల పనుల పురోగతిపై శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ.సింగ్ ఈనెల 29న జి ల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ ఈఎన్‌సీ సత్యనారాయణరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశానికి అనుమతులు, అంచనా నివేదికల పనులు పూర్తి చేసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు.

 

మరిన్ని వార్తలు