వ్యర్థం.. కానుంది ‘అర్థం’!

14 Dec, 2019 02:18 IST|Sakshi

సీ అండ్‌ డీ వేస్ట్‌ రీసైక్లింగ్‌తో కొత్త ఉత్పత్తులు

త్వరలో ప్రారంభం కానున్న జీడిమెట్ల ప్లాంట్‌

నగరంలో నాలాలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం వాటిల్లో నీరు పారే దారి లేకుండా పేరుకుపోయిన వ్యర్థాలు. ఈ వ్యర్థాల్లో కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డిమాలిషన్‌ (సీ అండ్‌ డీ) వేస్ట్‌ ఎక్కువగా ఉంటోంది. నాలాల సమస్యే కాదు.. రోడ్లపైనే వేస్తుండటం ప్రమాదాలకు కారణమవుతోంది. నడిచే బాటలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి త్వరలో సీఅండ్‌డీ వేస్ట్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ప్రారంభం కానుంది. ఈ రీసైక్లింగ్‌ నుంచి వెలువడే ఉత్పత్తులను వివిధ అవసరాలకు వినియోగించవచ్చు.

ఇలా రెండు రకాలుగా ప్రయోజనం ఉండటంతో జీహెచ్‌ఎంసీ దీనిపై దృష్టి సారించింది. నగరంలో రోజుకు 2 వేల మెట్రిక్‌ టన్నుల సీఅండ్‌డీ వేస్ట్‌ వెలువడుతున్నట్లు అంచనా. దీని రీసైక్లింగ్‌కు 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో పనిచేసే నాలుగు ప్లాంట్లకు టెండర్లు పిలిచారు. వీటిని దక్కించుకున్న రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ సంస్థ (హైదరాబాద్‌ సీఅండ్‌డీ వేస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) 2 ప్రాంతాల్లో పనులు చేపట్టింది. జీడిమెట్ల ప్లాంట్‌ దాదాపు పూర్తయింది. శుక్రవారం ప్లాంట్‌ పనితీరును జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు, రాంకీ ప్రతినిధులు వివరించారు.

ప్రాజెక్ట్‌ వ్యయం రూ.15 కోట్లు..
►జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ప్రభుత్వం 17 ఎకరాల స్థలం కేటాయించగా, 2018, జనవరి నుంచి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.15 కోట్లు. 
►శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి గ్రీన్‌ అండ్‌ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు.  
​​​​​​​►వేస్ట్‌ ప్రాసెసింగ్, ప్రొడక్షన్‌.. ఇలా రెండు విభాగాలుగా పనులు చేస్తున్నారు. రీసైక్లింగ్‌తో ఇటుకలు, పేవర్‌ బ్లాక్‌లు తయారు చేస్తారు. వ్యర్థాలను క్రషింగ్‌ ద్వారా కంకరగా, కోర్, ఫైన్‌ ఇసుకగా మారుస్తారు. ఈ కంకరను రోడ్ల లెవెల్‌ ఫిల్లింగ్‌కు, ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీగా, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులకు వాడొచ్చు.

టోల్‌ఫ్రీ నంబర్, యాప్‌ అందుబాటులోకి
బిల్డర్లు, ప్రజలు సీ అండ్‌ డీ వేస్ట్‌ను తరలించేందుకు సంబంధిత నంబర్‌కు ఫోన్‌ చేస్తే సంస్థ వాహనాల ద్వారా తరలిస్తారు. ప్లాంట్‌ ప్రారంభమయ్యాక టోల్‌ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ నంబర్‌ 040–21111111, మై జీహెచ్‌ఎంసీ యాప్, జీహెచ్‌ఎంసీ పోర్టల్‌ ద్వారా సమాచారమిచ్చినా తరలిస్తున్నారు.

దీనికిగాను ప్రస్తుతం టన్నుకు రూ.256 వసూలు చేస్తున్నారు. ప్లాంట్‌ ప్రారంభమయ్యాక టన్నుకు రూ.342 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యర్థాలను సొంతంగానే తరలిస్తే ఖర్చు తగ్గుతుంది. అయితే వీటిని తరలించే వాహనాలు తప్పనిసరిగా జీహెచ్‌ఎంసీ ఎం ప్యానెల్‌ జాబితాలో నమోదై ఉండాలి. లేకపోతే భారీ జరిమానాతోపాటు వాహనాలనూ సీజ్‌ చేస్తారు.

ప్రయోజనాలు... 
​​​​​​​►ఎక్కడ పడితే అక్కడ సీఅండ్‌డీ వ్యర్థాలుండవు.
​​​​​​​►రీసైక్లింగ్‌తో పేవర్‌ బ్లాక్‌లు, కెర్బ్‌ స్టోన్‌లు, ఇసుక, ఇటుకలు తదితరమైనవి ఉత్పత్తి చేసి పునర్వినియోగించడం వల్ల సహజ వనరులు వృథాకావు. ఠి    కాలుష్యం తగ్గుతుంది.

కలెక్షన్‌ పాయింట్ల ఏర్పాటు... 
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో నిర్మాణ వ్యర్థాలను ప్రాసెసింగ్‌ చేసి వివిధ రకాల మెటీరియల్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో జీడిమెట్లలో సీ అండ్‌ డీ వేస్ట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసినట్లు బల్దియా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాంకీ ఎన్విరో బయోమెడికల్‌ వేస్ట్‌ బిజినెస్‌ హెడ్‌ ఎ.సత్య తెలిపారు. సీ అండ్‌ డీ వేస్ట్‌ సేకరించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కలెక్షన్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు