తర్భూజా మస్త్‌ మజా

1 Apr, 2018 09:18 IST|Sakshi
తర్భూజా మస్త్‌ మజా

నగరంలో జోరుగా విక్రయాలు 

సీజన్‌లో రూ.15 లక్షల వ్యాపారం

మహారాష్ట్రతో పాటు పక్క     జిల్లాల నుంచి దిగుమతి

వినాయక్‌నగర్‌ : రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో మార్కెట్‌లో తర్బూజాల విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం నగరవాసులు తర్బూజాలను ఆశ్రయిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం, శరీరం డీ హైడ్రేషన్‌ బారిన పడకుండా తర్బూజా కాపాడుతుంది. నగరంలోని బస్టాండ్, కంఠేశ్వర్, ఎన్టీఆర్‌ చౌరస్తా, బోధన్‌రోడ్డు సహా ఆయా ప్రాంతాల్లో తర్బుజా విక్రయాలు జోరందుకున్నాయి.

నగరానికి చెందిన పలువురు వ్యాపారులు వీటిని ఫ్రూట్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుండగా మరికొంత మంది నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఫ్రూట్‌ మార్కెట్‌ వ్యాపారులు తర్బుజాలను మహారాష్ట్ర, ధర్మాబాద్, బోకర్, బిలోలి, దెగ్లూర్, అనంతపురం, నిర్మల్, బాన్సువాడ, బోధన్, గాంధారి, కామారెడ్డి ప్రాంతాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. నగరంలో మొత్తం 80 వరకు తర్బూజ విక్రయ షాపులు వెలిశాయి.

కాగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటాలు ధర రూ.600 నుంచి 700 వరకు ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో తర్బూజా ధర రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. గత వారం రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. గతంలో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో రూ.4గా ఉన్న తర్బజా ధర క్రమంగా పెరుగుతోంది. ఈ సీజన్‌లో సుమారు రూ.15లక్షల వ్యాపారం జరగనుంది. పలుచోట్ల వీటిని లారీలు, ఆటోలు, జీపుల్లో తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. కాగా జీఎస్టీ, ట్రాన్స్‌పోర్టు చార్జీల కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని వ్యాపారులు తెలిపారు.

తర్బుజా ఉపయోగాలు 

  • శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది.  
  • హృద్రోగ సంబంధిత వ్యాధులు రాకుండా తోడ్పడుతుంది. 
  • విటమిన్‌ ఏ, సీ, ఈలతో పాటు అనేక ఖనిజాలు ఉంటాయి. 
  • శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.  
  • శరీరాన్ని డిహైడ్రేషన్‌ బారి నుంచి కాపాడుతుంది.  
  • తర్బుజాలో ఉండే విటమిన్‌ బీ6 మెదడు చురుకుగా పని చేయడానికి దోహదపడుతుంది

సీజన్‌లో వ్యాపారం బాగుంటుంది
వేసవి సీజన్‌లో తర్బుజాలను విక్రయిస్తుంటాం. ఎండ వేడిమి పెరుగుతుండటంతో తర్బుజాల కొనుగోలు పెరిగింది. మహారాష్ట్ర నుంచి తర్బుజాలను దిగుమతి చేసుకుంటాం. నాణ్యతను బట్టి ధర నిర్ణయించి విక్రయిస్తుంటాం. ముందుముందు విక్రయాలు పెరుగుతాయి.  
– షేక్‌ షాకీర్, వ్యాపారి 

వ్యాపారంలో కొన్ని ఇబ్బందులున్నాయి 
ఎండ తీవ్రత పెరుగుతుండటంతో తర్బూజ విక్రయాలు జోరందుకున్నాయి. ఆరోగ్యానికి మంచిది కా వడంతో చాలా మంది తినేందు కు ఆసక్తి చూపుతా రు. వ్యా పారం బాగున్నా జీఎస్టీ, ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొంత మంది రైతులు నేరుగా మావ ద్దకు వచ్చి విక్రయిస్తుంటారు.  
– అహ్మద్‌ వసీముద్దీన్, వ్యాపారి
 

మరిన్ని వార్తలు