అయ్యా కాల్మొక్త.. కనికరిచండి

12 Jun, 2018 12:25 IST|Sakshi
ఫిర్యాదులు స్వీకరిస్తున్న జేసీ వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు

కలెక్టరేట్‌ ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ 

జిల్లా వ్యాప్తంగా 66 వినతులు, ఫిర్యాదులు   

సాక్షి, మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : అయ్యా.. నీ కాల్మొక్త.. నా భూమిని ఖబ్జా చేసిండ్రు.. అడిగితే కొడుతుండ్రు.. 30 ఏళ్ల కిందట ఎకరాకు రూ.16 వేల చొప్పున 5 ఎకరాలు భూమి కొన్నా.. నా భూమి పక్కనే ఉన్న తిమ్మారెడ్డి అనే దొర ఈ మధ్య పొలంలో ఖడీలు పాతిండు. ఇదేంటంటే కొట్టిండు.. ఊరి పెద్దమనుషులు కూడా ఆయనకే మద్దతు చెప్తున్నరు.. జర నాకు నాయం చెప్పండి.. అంటూ మహబూబ్‌నగర్‌ మండలం బొక్కలోనిపల్లికి చెందిన చిన్నబాలప్ప అధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు.

సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను అధికారులకు అందజేసి వేడుకున్నారు.  జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, సర్వే ల్యాండ్‌ ఏడీ శ్యాంసుదర్‌రెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి ఉదయ్‌కుమార్‌ వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూ కబ్జాలు, రైతుబంధు చెక్కు, పాస్‌బుక్కులు, హాస్టళ్లలో పిల్లలకు సీట్లు ఇప్పించాలని, పెన్షన్లు, ట్రైసైకిళ్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 66 దరఖాస్తులు అందించగా హెల్ప్‌డెస్క్‌ ద్వారా ఉచితంగా సేవలందించారు. ఉన్నతాధికారులు వచ్చిన వినతులను శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని ఆయా శాఖల మండల అధికా రులను ఆదేశించారు.


పాస్‌బుక్కులు, చెక్కులు రాలె 
భూప్రక్షాళన సర్వే చేసి ఆర్వోఆర్‌ 1బి ఇచ్చారు. రైతుబంధు పథకంలో అందరికిలాగే మాకు కూడా పాస్‌పుస్తకాలు, చెక్కులు వస్తాయని అనుకున్నాం. కానీ ఇంతవరకు రాలేదు. ఎందుకని అడిగితే సరిగ్గా సమాధానం చెప్తలేరు. సర్వే నెం.67లో మొత్తం 14.10 ఎకరాల భూమికి సంబంధించి రైతుబంధు పథకం పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులు ఇప్పించాలని కోరుతూ మహబూబ్‌నగర్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామ పరిధిలోని అవతలిగడ్డతాండకు చెందిన కె.చంద్రు నాయక్‌ తన కుటుంబ సభ్యులతో వచ్చి గోడును చెప్పుకున్నాడు.  
 

మరిన్ని వార్తలు