అడవికి అందమొచ్చింది

18 Apr, 2020 03:50 IST|Sakshi

లాక్‌డౌన్‌తో వన్యప్రాణులకు ఆటవిడుపు 

అటవీ ప్రాంతాల్లోని రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న వైనం

బయటికొస్తున్న చిరుతలు, పునుగుపిల్లులు, నీల్గాయి తదితర వన్యప్రాణులు

వాటికి ఏ ముప్పు వాటిల్లకుండా చూస్తున్నాం: వైల్డ్‌లైఫ్‌ ఓఎస్డీ శంకరన్‌

రకరకాల జంతువులు కనిపిస్తున్నాయి: నాగర్‌ కర్నూల్‌ డీఎఫ్‌వో జోజి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగింపుతో వన్యప్రాణులు, జంతువులకు ఆటవిడుపుగా మారింది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రోడ్లపై అన్ని రకాల వాహనాల (అత్యవసర అవసరాలకు మినహాయించి) రాకపోకలు, రణగొణ ధ్వనులు, కాలుష్యం లేకపోవడంతో వివిధ రకాల జంతువులు స్వేచ్ఛగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపైకి వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో పలుచోట్ల పగటిపూటే చిరుత పులులు రోడ్లపైనా కనిపించినట్టు అటవీశాఖ అధికారులకు నివేదికలు అందాయి. ఇటీవల ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని గుండం రోడ్డుకు సమీపంలో చిరుతలు దర్శనమిచ్చాయి. ఎప్పుడూ అడవుల్లోనే ఉంటూ బయటకు అంతగా కనిపించని పునుగుపిల్లులు ఈ మధ్యే బాన్సువాడ సమీప గ్రామాల్లోకి వచ్చాయి. ఇవి ఎక్కువగా చిత్తూరు అడవుల్లో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. 

ఆమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతలు
మనుషులు బందీ.. స్వేచ్ఛగా వన్యప్రాణులు.. 
లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఒక్కసారిగా మనుషులు ఇళ్లలోనే బందీ అయ్యారు. ఇందు కు పూర్తి భిన్నంగా వన్యప్రాణులు, జంతు వులు, పశు పక్ష్యాదు లు స్వేచ్ఛగా సంచ రిస్తూ తమ ఆనందాన్ని చాటుతున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రభావం పర్యావరణం, ప్రకృతిపై బాగా చూపుతోందనే అభిప్రాయాన్ని పర్యా వరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వివిధ అటవీ ప్రాంతా ల సమీపంలోని రోడ్లు, జనావాసాలకు దగ్గరగా వివిధ రకాల జంతువులు దర్శనమిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లు, ఏటూరునాగారం అటవీ ప్రాంతం సమీపంలోని కొన్ని చోట్ల పులులు కనిపించినట్టుగా అటవీ సిబ్బందితో పాటు స్థాని క ప్రజలు చెబుతున్నారు. చదవండి: చైనాపై పెరిగిన అనుమానాలు? 

సిద్దిపేట, వరంగల్, ఆదిలాబాద్, మహబూబాబాద్, ఆసిఫ్‌నగర్, కాగజ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం తదితర చోట్ల అటవీ ప్రాంతాలకు సమీపంలోని రోడ్లు దాటుతూ, ఆయా ప్రాంతాల్లోని నీటిగుంటలు, చెలమలు, అటవీ శాఖ ఏర్పాటు చేసిన సాసర్‌ పిట్ల వద్దకు చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, నీల్గాయిలు, దుప్పులు, సాంబార్, నక్కలు, ఇతర జంతువులు వచ్చినట్టుగా కెమెరా ట్రాప్‌లలో తీసిన ఫొటోలతో స్థానిక అటవీ అధికారుల నుంచి హైదరాబాద్‌ అరణ్యభవన్‌లోని ఉన్నతాధికారులకు నివేదికలు అందాయి.


బాన్సువాడ గ్రామంలోకి వచ్చిన పునుగు పిల్లి
ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఏర్పడటంతో పులులతో పాటు అడవుల్లోపలే ఉండటానికి ఇష్టపడే ఇతర జంతువులు కూడా స్వేచ్ఛగా రోడ్లపైకి, వాటి  సమీపంలోని నీటి గుంటలు, ఇతర ప్రాంతాల వద్దకు వస్తున్నట్టుగా వివిధ చోట్ల నుంచి అధికారులకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ (కేటీఆర్‌), ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌), ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో పులుల కదలికలు గుర్తించి, వాటి సంరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణను అటవీశాఖ సిద్ధం చేస్తోంది. 

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
‘వెహికిల్‌ ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో అడవులు, వాటి సమీపంలోని రోడ్లపై వన్యప్రాణులు, వివిధ జంతువుల సంచారం పెరిగింది. అక్కడక్కడ చిరుతలు కూడా తరచుగా కనిపిస్తున్నాయి. ఆమ్రాబాద్‌ పరిధిలో రోజుకు సగటున అయిదారు వందల వాహనాలు వెళ్లేవని, వీకెండ్స్‌లో వీటి సంఖ్య రెట్టింపయ్యేదని, ఇప్పుడవి పూర్తిగా నిలిచిపోవడంతో జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే మనుషులు వేసే పండ్లు, ఆహారానికి అలవాటు పడ్డ కోతులు, అవి లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ అడవుల్లోకి తరలుతున్నాయి. ఇక కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అడవుల్లోని చెంచులకు బియ్యం, ఇతర సరుకుల పంపిణీ చేసేందుకు కొందరు వస్తున్నారు. మేము ఎవరినీ అడవుల్లోకి అడుగుపెట్టనీయడం లేదు. మేమే చెంచులు, గిరిజనులకు సహాయ సామగ్రిని అందజేస్తున్నాం..’ 
– ‘సాక్షి’తో నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌వో జోజి  

వన్యప్రాణులకూ తగిన స్పేస్‌ ఇవ్వాలి.. 
‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో అడవులు, జూలు, అభయారణ్యాలు, జాతీయపార్కుల్లోని జంతువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా అడవుల్లోంచి బయటకు వస్తున్న వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూస్తున్నాం. ప్రస్తుతం అడవుల్లోని రోడ్లపై, వాటికి సమీప జనావాసాలకు దగ్గరగా జంతువులు కనిపిస్తున్నట్టు ఫీల్డ్‌ స్టాఫ్‌ చెబుతున్నారు. పగలే చిరుతపులులు దర్శనమిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి జంతువులకు సహజంగా తగిన స్పేస్‌ (జాగా) ఇవ్వాలని స్పష్టమైంది. మానవ హక్కులకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తామో, స్వేచ్ఛగా సంచరించే విషయంలో జంతువులకున్న హక్కులను మనం గౌరవిస్తే మంచిది..’ 
    – ‘సాక్షి’తో అటవీ శాఖ వైల్డ్‌లైఫ్‌ ఓఎస్డీ ఎ.శంకరన్‌ 

మరిన్ని వార్తలు