బుల్లి తెర భారం

28 Dec, 2018 11:16 IST|Sakshi

వరంగల్‌: ఇకపై ప్రేక్షకులకు బుల్లితెర వీక్షణం మరింత భారం కానుంది. నేరుగా ఇంటింటికీ ప్రసారాలు (డీటీహెచ్‌) అందించే సంస్థలకు మాదిరిగా పే చానళ్లకు సంబంధించి అదనపు చార్జీలను కేబుల్‌ టీవీ నిర్వాహకులకు చెల్లించాలని టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సామాన్యులపై భారం పడనుంది. ఇప్పటివరకు కేబుల్‌ టీవీ వినియోగదారులు వారి ప్రాంతాల్లోని ఆపరేటర్లు నిర్ణయించిన ప్రకారం నెలనెలా బిల్లులు చెల్లించేవారు. వారు ప్రసారం చేసే అన్ని చానళ్లను వీక్షించే అవకాశం ఉండేది. డిజిటల్‌ ప్రసారాలు, సెట్‌టాప్‌ బాక్స్‌లు ఏర్పాటు చేసినప్పటికీ బిల్లుల చెల్లింపుల్లో పెద్దగా తేడా రాలేదు. ప్రసారాలు డిజిటల్‌గా మారడంతో చిత్రం, మాటల్లో స్పష్టత పెరిగింది. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో 250 నుంచి 400 చానళ్ల వరకు కేబుల్‌ ఆపరేటర్లు.. ఎంఎస్‌ఓల సాయంతో వినియోగదారులకు అందజేస్తున్నారు.

ఉచితంగా లభించే వినోదం, వార్తలు, సినిమాలు, వంట ప్రోగ్రాం, స్పోర్ట్స్‌ చానళ్లు హిందీ, ఇంగ్లిష్, తమిళం, మళయాలం, ఉర్దూ భాషల్లో ప్రసారం అవుతున్నాయి. నగరాల్లో మాస్టర్‌ కంట్రోల్‌ రూం ఆపరేటర్లు చేసే ప్రసారాల్లో స్థానిక ఆపరేటర్లు తన ప్రాంత వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రసారాలను అందిస్తున్నారు. సెట్‌టాప్‌ బాక్స్‌లు ఏర్పాటు చేశాక, ప్రధానమైన మాస్టర్‌ ఆపరేటర్ల పరిధిలో ఎంత మంది వినియోగదారులు టీవీప్రసారాలను తిలకిస్తున్నారనే లెక్క తేలింది. తదనుగుణంగా ఆదాయం ఎంఎస్‌ఓలకు పెరిగింది. నెలరోజుల పాటు టీవీ ప్రసారాలు తిలకించిన వినియోగదారుడు బిల్లులు చెల్లించే పద్ధతి ఇప్పుడు అమలులో ఉంది.

డీటీహెచ్‌ ప్రసార సంస్థలు : ప్రస్తుతం ఎంఎస్‌ఓలు డిజిటల్‌ ప్రసారాలను వినియోగదారులకు అందజేస్తున్నారు. వీటిలో చానళ్లకు విడివిడిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రసారాల పరంగా క్రీడలు, సినిమాలు, ఇంగ్లీ్లషు చానళ్లకు ప్యాకేజీల వారీగా చెల్లించాలి. అప్పుడే ఆయా చానళ్ల ప్రసారాలు జరిగేవి. చానళ్లకు ఒక రేటు, ప్యాకేజీలకు ఒక రేటన్లుండేవి. ఇవి పొందేందుకు నెలవారీగా, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది సబ్‌స్క్రిప్షన్లను రీచార్జి చేసుకుంటేనే ప్రసారాలు చూసే వీలుంది. ఆరునెలలు, ఏడాది కోసం ఒకేసారి రీచార్జి చేసుకుంటే కొంత రాయితీలను డీటీహెచ్‌ కంపెనీలు అందిస్తున్నాయి.

నూతన విధానం ఇలా..
కేబుల్‌ టీవీ ఆపరేటర్లకు వినియోగదారులు ప్రీపెయిడ్‌ పద్ధతిలో ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్‌ నిబంధనల ప్రకారం నిర్ధారిత రుసుముకు ఆపరేటర్లు 100 ఉచిత చానళ్లను వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. దీనికి కేబుల్‌ ఆపరేటర్‌కు రూ.130తో పాటు జీఎస్టీ చెల్లించాలి. పే చానళ్లు వీక్షించాలంటే ఆయా కంపెనీలకు ప్యాకేజీల వారీగా ముందుగానే చెల్లింపులు చేయాలి. ప్రస్తుతం కేబుల్‌ ఆపరేటర్లు అందిస్తున్న అన్ని చానళ్లు చూడాలంటే నెలవారీ బిల్లులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తెలుగు సీరియళ్లు, సినిమాలు, క్రీడా చానళ్లు చూడాలంటే ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే ఎక్కువ మొత్తం (కనీసం రూ.350) చెల్లించక తప్పదని ఎంఎస్‌ఓలు చెబుతున్నారు. దీంతో సగటు రూ.150 నుంచి రూ.250 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది.

గడువు ఈ నెల 29 : ఒక ప్యాకేజీలో చేరాలంటే చానల్‌కు గరిష్టంగా రూ.19 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంతకు మించి చానల్‌ ధర నిర్ణయించుకుంటే ఏ ప్యాకేజీలో భాగం అయ్యే వీలుండదు. ఆ చానల్‌ ప్రసారం చేసే ప్రసారాల(సొంత కంటెంట్‌)పై విశ్వాసం ఉంటేనే ప్రత్యేక ధర నిర్ణయించుకునే వీలుంటుంది. తెలుగు చానళ్లను చూస్తే వార్తా చానళ్లు ఉచితంగానే లభిస్తుండగా పలు చానళ్ల ధర రూ.17, రూ.19గా నిర్ణయించారు.

వినియోగదారులు కోరుకున్న చానళ్లు మాత్రమే చూడగలగడం నూతన విధానం ప్రత్యేకతగా ఎంఎస్‌ఓలు తెలుపుతున్నారు. నూతన విధానానికి ఈ నెల 29వ తేదీ వరకు సిద్ధం కావాల్సి ఉంది. జిల్లాలో సుమారు 300 చానళ్లను ప్రసారం చేస్తున్నా నెలకు రూ.150 నుంచి 220 వరకు వసూలు చేస్తున్నారు. ఇకపై ఇంట్లో ఎవరెవరూ ఏ చానల్‌ను చూడాలో అన్న విషయాలను చర్చించి ఆ ప్యాకేజీలను పొందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా