పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి

6 Mar, 2018 12:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:    మహిళా సాధికారతే తమ ధ్యేయమంటూ ఉపన్యాసాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మహిళల పట్ల మాత్రం చిన్నచూపు చూస్తున్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆరోపించారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో నగరంలోని నారాయణగూడ ఫ్లైఓవర్‌ కింద ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కి.మీ మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

రంగంలోకి దిగిన అబిడ్స్‌ ఏసీపీ భిక్షంరెడ్డి, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ బండారి రవీందర్‌యాదవ్‌లు మహిళా సిబ్బందితో సభ్యులను తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో పోలీసులకు ఐద్వా సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా వారిని వ్యాన్‌ ఎక్కించి అరెస్ట్‌ చేశారు. అనంతరం మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్న బీజేపీ  మహిళా బిల్లును ప్రవేశపెట్టడంలో చిత్తశుద్ధి చూపించడం లేదన్నారు. ఆందోళనలో ఐద్వా సభ్యురాలు జ్యోతి, ఉపాధ్యక్షురాలు కె.ఎన్‌.ఆశాలత, ఉపాధ్యక్షురాలు లక్ష్మమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు స్వర్ణ, అరుణజ్యోతి, వినోద, నాగలక్ష్మి, శశికళ, లీలావతి, సృజన తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు