ఆర్థికసాయం చేయండి

22 Jul, 2019 13:57 IST|Sakshi
హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థి శ్యాం ప్రసాద్‌(ఫైల్‌)

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిస్తా..

తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి పల్గటి శ్యామ్‌ ప్రసాద్‌ 

సాక్షి, కొండాపూర్‌(సంగారెడ్డి): ఆర్థికస్థోమత లేకపోయినా లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపడా ఆత్మవిశ్వాసం ఉంది. అందరిలో ఒకరిలా కాకుండా నాకంటూ ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు పల్గటి శ్యామ్‌ ప్రసాద్‌ స్వేరో. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగడంతో గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆలోచనలకు ఆకర్షితుడయ్యాడు. సాధించాలనే తపన, పట్టుదలతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సలహాలు, సూచనల మేరకు భువనగిరిలోని రాక్‌ క్‌లైంబింగ్‌లో శిక్షణ పొందాడు.               

పల్గటి శ్యామ్‌ ప్రసాద్‌ స్వేరోది సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం సైదాపూర్‌ గ్రామం. తండ్రి అశోక్, తల్లి కంసమ్మ రోజూ కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్యామ్‌ప్రసాద్‌ ప్రాథమిక విద్యాబ్యాసం అనంతసాగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివాడు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియెట్‌ విద్యాభ్యాసాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిండాడు.

ప్రస్తుతం సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సూచనలతో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను హిమాలయ పర్వతాలను అధిరోహించేందుకు ఎంపిక చేశారు. అందులో శ్యామ్‌ ప్రసాద్‌ ఒకరు. దీనికోసం భువనగిరిలో కోచ్‌ శేఖర్‌బాబు వద్ద 15 రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 2014లో 25 రోజుల పాటు 20 మంది విద్యార్థులతో కలిసి హిమాలయ పర్వతాన్ని అదిరోహించాడు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అదిరోహించిన మలావత్‌ పూర్ణ హిమాలయ పర్వతాలు అధిరోహించిన సభ్యుల్లో శ్యామ్‌ప్రసాద్‌ కూడా సభ్యుడిగా ఉన్నడు.

దాతలు సహకరించాలి
హిమాలయ పర్వతాలు అధిరోహించిన స్ఫూర్తితో ప్రపంచంలోనే రెండో ఎత్తైన సౌతాఫ్రికాలోని టాంజానియా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి శ్యాం ప్రసాద్‌ ఎంపికయ్యాడు. కిలీమంజారో వెళ్లడానికి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు కూలీలు కావడంతో వారికి అంత ఆర్థిక స్తోమత లేదు. ఈ నెల 25వ తేదీ వరకు చెల్లించాలి. లేకపోతే వచ్చిన అవకాశం చేజారిపోతుందని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిదులు, వ్యాపార వేత్తలు స్పందించి సహకారం అందిస్తే జిల్లా పేరును ప్రపంచస్థాయిలో నిలబెడతానని విద్యార్థి శ్యాం ప్రసాద్‌ పేర్కంటున్నాడు.

మరిన్ని వార్తలు