డబ్బు ఇప్పించకపోతే దూకేస్తా?

25 Nov, 2018 08:23 IST|Sakshi
సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడు, గుమిగూడిన ప్రజలు

ఉద్యోగం ఇప్పిస్తానని ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ మోసం చేశారని బాధితుడి ఆరోపణ

తన వద్ద తీసుకున్న రూ.2లక్షలు ఇప్పించాలని డిమాండ్‌

మూడు గంటలు హైడ్రామా.. పోలీసుల జోక్యంతో కిందికి దిగిన యువకుడు

అడ్డగూడూరు(తుంగతుర్తి) : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ సృష్టించాడు. ఈ ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు..మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన ఏనుగునూతల సంజీవ మండల కేంద్రంలోని ఓ సెల్‌టవర్‌ ఎక్కాడు. రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం తనకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 2లక్షలు తీసుకున్నాడని ఆరోపించాడు.

ఆ డబ్బు తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరాడు. లేకుంటే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగివచ్చాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మూడు గంటల హైడ్రామాకు తెరపడింది. అయితే ఇదే విషయంపై రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు