మార్పు మా నుంచే రావాలి..

20 Feb, 2018 17:28 IST|Sakshi

ఆలోచనలు పాజిటివ్‌గా ఉండాలి

సిరిసిల్ల న్యాయవాది బూర్ల కళ్యాణి 

సిరిసిల్లటౌన్‌: ఆడపిల్లల ఆలోచనల సరళి మారినప్పుడే గుర్తింపు వస్తుందని.. నాలుగుగోడల మధ్యనే ఉండాలన కుండా విద్యతో సమాజాన్ని చదవాలని..అప్పుడే స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకగలుగుతారని సిరిసిల్లకు చెందిన న్యాయవాది బూర్ల కళ్యాణి అన్నారు. మహిళా సాధికారతపై ‘సాక్షి’తో ఆమె అభిప్రాయాలు పంచుకున్నారు.  

కండెలు చుట్టినా.. 
సిరిసిల్లలోని వెంకంపేట. నాన్న చక్రపాణి నేతకార్మికుడు. అమ్మ లావణ్య గృహిణి. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందుండేవాళ్లం. మగపిల్లలు లేకపోవడంతో నాన్న సాంచాలు నడుపుతుంటే ఆయనకు సాయంగా కండెలు చుడుతూ ఉండేవాళ్లం. అక్క జ్యోతి బీఎడ్, చెల్లి డిగ్రీ పూర్తి చేశారు. ఆర్థికంగా అంతంతే ఉండడంతో పదోతరగతి దాకా వెంకంపేట ప్రభుత్వ పాఠశాల, ఇంటర్మీడియెట్‌ సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివాను.  

మేనత్త స్ఫూర్తితో..  
కోర్టులో ఏపీపీవోగా పనిచేస్తున్న మేనత్త వనజ స్ఫూర్తితోనే న్యాయవాద వృత్తిలోకి వచ్చాను. ఇంటర్‌ తర్వాత హైదరాబాద్‌ ఉస్మానియా యునివర్సిటీలో ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేశాను. ఏడాదిగా సిరిసిల్ల కోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న. అమ్మనాన్నల కష్టం ఎప్పటికీ గుర్తొస్తుంటుంది. ముగ్గురు ఆడపిల్లలమైనప్పటికీ వెనుకడుగు వేయకుండా ఎంతో బాధ్యతగా పెంచారు.  

మహిళా వివక్షపై.. 
కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకనే ఆడవారిపై వివక్ష ఎక్కువవుతున్నాయి. ఒక ఇంట్లో అత్త తన కొడుకు తనకు కాకుండా భార్యకు దగ్గరవుతున్నాడన్న ఆలోచనలతో కోడలిపై పగ సాధిస్తుంది. మరికొన్ని కేసుల్లో మగవారికి బయట పనుల్లేక పోవడంతో ఇంటికి వచ్చి భార్యతో గొడవలు పడుతున్నారు.  కుటుంబ బాధ్యతల్లో మహిళలూ భాగస్వాములవుతున్న నేపథ్యంలో అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారు. చాలా మంది అమ్మాయిలను చదివించడంలో కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం కరువవుతుంది.  వరకట్నాల కోసం దాడులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు సైతం మగపిల్లలకు ఆడవారిపై సదుద్దేశం కలిగేలా పెంచాలి.    

ఆత్మస్థైర్యంతో ముందుకుపోవాలి 
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. ఈరోజుల్లో సోషల్‌మీడియాలో వస్తున పోస్టింగ్‌లు, చాటింగ్‌లకు ఆకర్షితులై స్నేహం చేయడం మంచిదికాదు. అక్షరజ్ఞానంతోనే సంఘంలోని చీకట్లను చీల్చగలం. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. 

మరిన్ని వార్తలు