మేమూ మనుషులమే... ట్రాన్స్‌జెండర్‌ అంజలి ఆవేదన

28 Sep, 2018 08:41 IST|Sakshi

ట్రాన్స్‌విజన్‌’ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ ఏర్పాటు 

ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై అవగాహన కల్పిస్తూ వీడియోల రూపకల్పన 

ప్రతిభను గుర్తించిన ‘లాడ్లీ’ మీడియా సంస్థ 

అంజలికి అవార్డు ప్రదానం

ట్రాన్స్‌జెండర్‌ అంజలి అమీర్‌ మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి సరసన హీరోయిన్‌గా నటించింది. మరో ట్రాన్స్‌జెండర్‌ ప్రీతికా యూషీనా తమిళనాడులోని చులైమేడు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తోంది. ఇక సత్యశ్రీ షర్మిల ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందింది. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మంది ట్రాన్స్‌జెండర్లు వివిధ రంగాల్లో తమ సత్తాచాటుతున్నారు. ‘మేమూ మనుషులమే..మమ్మల్ని చులకనగా చూడొద్ద’ని వేడుకుంటున్న వారు... ప్రతిభలో తామేమీ తీసిపోమనినిరూపిస్తున్నారు. ఇదే కోవకు చెందుతుందినగరానికి ట్రాన్స్‌జెండర్‌ అంజలి కల్యాణపు.  

హిమాయత్‌నగర్‌: బాలానగర్‌కు చెందిన అంజలి గ్రాడ్యుయేట్‌. ఆమెకు పుట్టుకతోనే వచ్చిందీ సమస్య. తర్వాత కొన్నేళ్లకు తెలిసింది తనలోని లోపం. ఇంట్లో వాళ్లకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. కానీ వాళ్లు అర్థం చేసుకోకపోగా... ‘ఛీ.. పొమ్మని’ బయటకు గెంటేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో.. తానేంటో సమాజానికి చూపించాలనుకుంది. ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తమ హక్కులు సాధించుకోవాలని నిశ్చయించుకుంది. ఇందుకు తోటివారితో కలిసి ‘ట్రాన్స్‌విజన్‌’ పేరుతో తెలుగు, కన్నడ, ఉర్దూ భాషల్లో 2017లో యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించింది. దేశంలో ట్రాన్స్‌జెండర్‌ ప్రారంభించిన తొలి యూట్యూబ్‌ చానెల్‌ ఇదే కావడం విశేషం.

ఆమే వ్యాఖ్యాత... 
అంజలి, ఆమె అమ్మగా భావించే ముద్రబోయిన రచన, చంద్రముఖి, జాహ్నవి, సోనియా కలిసి యూట్యూబ్‌ చానెల్‌ ఏర్పాటు చేయాలని ఆలోచించారు. వీరికి ప్రొడ్యూసర్‌ మోజెస్‌ చేయూతనిచ్చారు. అలా 2017లో ‘ట్రాన్స్‌విజన్‌’ పేరుతో తెలుగు, కన్నడ, ఉర్దూ భాషల్లో యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభమైంది. తెలుగులో అంజలి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. తాను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలను ప్రజల ముందుంచాలని, ట్రాన్స్‌జెండర్లను ఎవరూ చులకనగా చూడొద్దనే భావనతో ఆమే స్క్రిప్ట్‌ కూడా రూపొందించుకుంటోంది. ఏడాది కాలంగా 9 ఎపిసోడ్స్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది తమ చానెల్‌ను చూస్తున్నారని అంజలి తెలిపారు.  

యూనివర్సిటీల్లో అవగాహన...
ట్రాన్స్‌జెండర్స్‌ ఆటో ఎక్కినా, బస్సెక్కినా, సినిమాకెళ్లినా వింతగా చూస్తారు. ఆ సమయంలో తామెంతో ఆవేదనకు గురవుతామని అంజలి పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్స్‌ కూడా మనుషులేననే అవగాహనను విద్యార్థుల్లో కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తదితర నగరాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లోనూ వీరు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం నగంరలోని పోలీస్‌ అకాడమీలో యంగ్‌ ఐపీఎస్‌ అధికారులతో సమావేశమయ్యారు అంజలి.   

అవార్డుతో మరింత బాధ్యత...  
‘ది లాడ్లీ మీడియా అండ్‌ అడ్వర్టయిజింగ్‌ అవార్డ్స్‌’ పేరుతో లాడ్లీ సంస్థ ప్రతి ఏటా వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి అవార్డులు అందజేస్తుంది. ఒక ట్రాన్స్‌జెండర్‌ వ్యాఖ్యాతగా తమ సమస్యలపై యూట్యూబ్‌ చానెల్‌ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం గొప్ప విషయమని ఆ సంస్థ గుర్తించింది. సెప్టెంబర్‌ 14న ఢిల్లీలో అంజలికి అవార్డు ప్రదానం చేశారు. ‘మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. అప్పుడు మేమంతో హ్యాపీగా ఉంటాం. ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి వివిధ రంగాల్లో అవకాశాలిస్తే బాగుంటుంది. సమాజానికి మేమేంటి? అనేది తెలియజేయాలనే యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించాను. అందరికీ అవగాహన కల్పిస్తున్నాను. ఇప్పుడీ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింద’ని అంజలి చెప్పారు.

మరిన్ని వార్తలు