జాతీయ పార్టీగా వైఎస్సార్ సీపీ

3 Jun, 2014 02:43 IST|Sakshi
జాతీయ పార్టీగా వైఎస్సార్ సీపీ

దేశం గర్వించేలా తెలుగువారి ఖ్యాతిని ముందుకు తీసుకెళదాం: జగన్
 
వైసీపీ కార్యాలయంలో తెలంగాణ సంబురాలు
జాతీయ, పార్టీ జెండాలను ఆవిష్కరించిన జగన్
2నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులు
తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ ఉన్నారని వెల్లడి

 
 హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి జాతీయ పార్టీగా కొనసాగనుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణకు తొలిసీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. మంచి చేసే ప్రతి పనికి వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంటుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జాతీయ పతాకంతో పాటు పార్టీ జెండా ను జగన్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకు రెండునిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఒకే భాష, ఒకే జాతిగా ఉన్న రెండు రాష్ట్రాల ప్రజలుగా ఒకరికొకరు సహకరించుకుంటూ దేశం గర్వపడేలా తెలుగువారి ఖ్యాతిని ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి పోయింది. తెలంగాణ రాకముందు అంతా కలిసి ఉండాలని.. తెలుగు వారిని చూసి దేశమంతా గర్వపడేలా ఉండాలని తాపత్రయపడ్డాం. కానీ విభజన జరిగిపోయింది.

అయినా రాష్ట్రాలను వేరు చేయగలిగారుగాని తెలుగు వారి మనసులను వేరు చేయలేరని మరోసారి ఉద్ఘాటిస్తున్నా. ఈ ప్రాంతం వారికి ఏ సమస్య వచ్చినా ఆ ప్రాంతం వారు తోడుగా ఉంటారు. ఆ ప్రాంతం వారికి ఏ సమస్య వచ్చినా ఈ ప్రాంతం వారు తోడుగా ఉంటారు..’’అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలోనూ ప్రతీ ఒక్కరి గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా తెలంగాణ ప్రజల కోసం వైఎస్ గడప, గడపను తట్టారని, తెలంగాణ అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా చేశారని ఆయన పేర్కొన్నారు. రైతులు 17 లక్షల పంపుసెట్ల ఆధారంగా వ్యవసాయం చేయగలుగుతున్నారంటే.. అది రాజశేఖరరెడ్డి ద్వారానే జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి వైఎస్ అండగా నిలబడ్డారు కాబట్టే, రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణలో కూడా గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని కచ్చితంగా తెలంగాణలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని జగన్ చెప్పారు.

తెలంగాణ నేతలతో సమావేశం

 తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణకు చెందిన నేతలతో జగన్ అరగంట పాటు ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచనలు జరిపారు. వైఎస్ కలలు కన్న సువర్ణయుగాన్ని తెలంగాణలో తెచ్చుకునేందుకు కచ్చితమైన ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అడహక్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, హెచ్.ఎ.రెహ్మాన్, బి.జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, విజయారెడ్డి, కె.శివకుమార్, టి.వెంకట్రావ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్  తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు