ఆవిర్భావ సందడి

3 Jun, 2014 02:55 IST|Sakshi
  • కార్యాలయాల్లో పండగ వాతావరణం
  • సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో తెలంగాణ రాష్ర్ట అవతరణ సంబురాలు అంబరాన్నంటాయి. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా అవతరణ వేడుకలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండిఏ, కలెక్టరేట్, ఆర్టీసీ, రవాణా, పౌరసరఫరాలు, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రభుత్వ ఆసుపత్రులు, సీపీడీసీఎల్, విద్యా, రెవెన్యూ, సంక్షేమం తదితర అన్ని కార్యాలయాల్లోనూ అధికారులు, ఉద్యోగులు ఘనంగా కొత్త రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు.

    ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఎగుర వేశారు. ప్రతిరోజు ఫైళ్లు, ప్రభుత్వ పనులు, పౌరసేవలతో రద్దీగా ఉండే కార్యాలయాల్లో పండుగ వాతావరణం  నెలకొంది. అధికారులు, ఉద్యోగులంతా ఒక్కచోట చేరి నూతన రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ కేక్‌లు కట్ చేశారు. ఉద్యోగులు మిఠాయీలు పంచుకొని పరస్పర ఆలింగనాలతో శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. సంతోషంగా రంగులు చల్లుకున్నారు.

    తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని ఉద్యోగులు ప్రతిన బూనారు. కార్యాలయాలను అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాలు వెలుగులు విరజిమ్మాయి. తెలంగాణ సంస్కృతిని చాటుతూ మహిళా ఉద్యోగులు బతుకమ్మలు ఆడారు. బోనమెత్తుకున్నారు. మరోవైపు నగరంలోని ప్రధాన కూడళ్లలోనూ  రాష్ర్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తాయి.

    ఆదివారం అర్ధరాత్రి నుంచే మొదలైన వేడుకలు సోమవారం కూడా కొనసాగాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు గులాబీ వర్ణశోభితమయ్యాయి. వేడుకల్లో అమరుల త్యాగాలను కొనియాడుతూ పాడిన పాటలు, తెలంగాణ ధూంధాంలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్ని చోట్ల ఆటాపాటలతో ప్రజలు కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగువిశ్వవిద్యాలయం సహా పలు విద్యాకేంద్రాల్లోనూ విద్యార్ధులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
     
    కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో...
     
    దోమలగూడ: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్బావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర క మిషనర్ డాక్టర్ అశోక్ కేకును కట్ చేసి, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం బోర్డును ఆవిష్కరించారు. సోమవారం ఉదయం కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

    కార్యక్రమంలో అడిషనల్ లేబర్ కమిషనర్ సూర్యప్రసాదు, మురళీసాగర్, జాయింట్ లేబర్ కమిషనర్ డాక్టర్ గంగాధర్, డిప్యూటీ లేబర్ కమిషనర్లు నరేష్‌కుమార్, శ్రీనివాసు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు చక్రధర్, శ్యాంసుందర్‌రెడ్డి, కార్మిక శాఖ టీజీఓ అధ్యక్షులు రాజేందర్, ప్రధానకార్యదర్శి పండరీనాథ్, టీఎన్జీవో అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు