'వాళ్లు...తెలంగాణ ప్రజలు కాదా? పాకిస్తాన్ వాళ్లా?'

13 Nov, 2014 13:52 IST|Sakshi
'వాళ్లు...తెలంగాణ ప్రజలు కాదా? పాకిస్తాన్ వాళ్లా?'

హైదరాబాద్ : తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో అన్యాయంగా కలిపారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ శాసనసభా పక్ష నాయకుడు తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఏడు మండలాల్లో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు కూడా పోటీ చేశారని, కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చినందున తమకు సంబంధం లేదనటం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు.

 

తాటి వెంకటేశ్వర్లు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ "తొలి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ఆప్రాంత ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. అఖిలపక్షంతో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇప్పుడు 7 మండలాలకు మేమే కరెంట్ ఇస్తున్నామని చెప్పటం ఎంతవరకు సబబు. ఆ ఏడు మండలాల వారికి ఉచితంగా కరెంట్ ఇస్తామనడం ఏంటి... వారు తెలంగాణ ప్రజలు కాదా? పాకిస్తాన్ వాళ్లా?, రేషన్ కార్డులు, ఫించన్ల పథకంపై ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. 7 మండలాల విషయంపై అసెంబ్లీలో చర్చించి న్యాయం జరిగేలా కేసీఆర్ చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.


పినపాక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముంపుకు గురైన 7 మండలాలకు పునరావాసం కల్పించాలంటే ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తోందని అన్నారు. '10 జిల్లాల తెలంగాణలో అంగుళం కూడా వదలమంటూ ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పారని,  తొలి తీర్మానం ఏర్పాటు చేసి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తామన్నారు. 7 మండలాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొంది. మా నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్కి వెళ్లడంతో పాటు భవిష్యత్లో పలు సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుంది. సాధ్యమైనంత త్వరలో ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం కావాలి. పోలవరం ముంపు ప్రజలు, ఉద్యోగుల భద్రతకు సంబంధించి ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలి' అని పాయం కోరారు.

>
మరిన్ని వార్తలు