TS: మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం?

9 Dec, 2023 20:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యమైనట్లు సమాచారం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్‌ మాయం కావడంపై కలకలం రేగుతోంది. కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఫైల్స్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు.

ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్‌ ఎలిజ, వెంకటేష్‌, ప్రశాంత్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు సమాచారం. నిన్ననే ఫైల్స్ మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు అధికారులు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలంలో ఆధారాలను డీసీపీ సేకరించారు. ఆ శాఖ డైరెక్టర్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ.. ప్రశ్నించగా, ఫైల్స్‌ మాయంపై ఎలాంటి సమాచారం లేదంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఫైల్స్‌ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

కాగా, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని పశుసంవర్ధక శాఖ  మాజీ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సచివాలయం ప్రారంభమై 9 నెలలు కావొస్తుందని, మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయాన్ని నూతన సచివాలయంలోని రెండో అంతస్తులోకి తరలించి కార్యకలాపాలు నిర్వహించామని తెలిపారు.

మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్‌ను నిర్దిష్టమైన విధానంలో ఎప్పటికప్పుడు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేయడం జరిగిందని వివరించారు.

శాఖాపరమైన ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయని తెలిపారు. ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని కళ్యాణ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ పేరుతో..

>
మరిన్ని వార్తలు