లోక్‌సభ సభ్యులే చైర్మన్లు

18 Aug, 2015 02:05 IST|Sakshi
లోక్‌సభ సభ్యులే చైర్మన్లు

ఎన్‌హెచ్‌ఎం విజిలెన్స్ కమిటీలపై కేంద్రం స్పష్టీకరణ
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి


హైదరాబాద్: ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. కమిటీలకు చైర్మన్లుగా కేంద్రం నియమించిన వారిని కాదని, ఆయా పదవుల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను నియమించడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీల చైర్మన్లుగా తాము ఎంపిక చేసిన లోక్‌సభ సభ్యులనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్ ఝలానీ ఈనెల 14న రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్యకు ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.

మిషన్ ప్రకాశం జిల్లా చైర్మన్‌గా ఆదే జిల్లాకు చెందిన లోక్‌సభ సభ్యుని హోదాలో తనను, తన మాదిరిగానే నెల్లూరు మిషన్ చైర్మన్‌గా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని, వైఎస్సార్ జిల్లా చైర్మన్‌గా వైఎస్ అవినాష్‌రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ 2015 మార్చి 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిందని సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లో అక్కడి  ఎంపీలను కేంద్రం నియమించిందన్నారు. అయితే సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా.. తమను తప్పిస్తూ టీడీపీ వారిని నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు.  తానీ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు 2015 జూన్ 17వ తేదీన ఫిర్యాదు చేశానని, దీంతో సీఎస్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలొచ్చాయని తెలిపారు.ఈ ఆదేశాలను తాము సీఎస్‌కు పంపుతున్నామని తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు