మా తరం కాదు..

18 Aug, 2015 02:02 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉల్లి పేరు చేబితే ఇటు జనం..అటు అధికార గణం వామ్మో.! అంటున్నారు. ఉల్లి దిగుబడి తగ్గడం వల్ల ఏర్పడిన కొరత జిల్లా వాసులను కలవరపెడుతోంది. ప్రభుత్వం రైతు బజార్లలో విక్రయిస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో జనం అధిక ధరలకు బయట మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. కేజీకి రూ.40 నుంచి రూ.50 వరకూ చెల్లిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే నెలాఖరు వరకూ ఉల్లిపాయల కొరత తప్పదని తెలుస్తోంది. అప్పటికైనా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో వచ్చిన దిగుబడిని మనకు దిగుమతి చేస్తేనే  గట్టెక్కగలమని అధికారులు భావిస్తున్నారు.
 
 తగ్గిన దిగుబడి..పెరిగిన దిగుమతి:
 తాడేపల్లిగూడెం, రాజమండ్రి మార్కెట్ల నుంచి విశాఖకు ఉల్లి పాయలు సరఫరా అవుతుంటాయి. ఇప్పుడు అక్కడ దిగుమతి గణనీయంగా పడిపోవడంతో కర్నూలు నుంచి తెప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ జిల్లాకు 9వేల క్వింటాళ్ల ఉల్లిని కర్నూలు నుంచి దిగుమతి చేశారు. రోజుకి సగటున 60 టన్నుల ఉల్లిని అక్కడి నుంచి తీసుకువస్తున్నారు. అక్కడ కేజీకి రూ.34 నుంచి రూ.38 వరకూ చెల్లిస్తున్నారు. రవాణా ఖర్చులు కలిపి కేజీ ఉల్లి రూ.42 వరకూ పడుతోంది. రైతు బజార్లలో రూ.20కే అందిస్తున్నారు.  అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. కర్నూలులో కూడా నిల్వలు నిండుకుంటే మహారాష్ట్ర ఉల్లి ఆదుకోవాలి. కానీ నాసిక్, షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఏ ఏడాది ఉల్లి దిగుబడి తగ్గినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడి నుంచి తెచ్చేందుకు నాణ్యత పరిశీలన చేయడానికి అధికారుల బృందం అక్కడికి వెళ్లింది. నెలాఖరు నాటికి గానీ అవి అందుబాటులోకిరావు. కడప జిల్లా నుంచి కూడా ఉల్లి తెప్పించే పనిలో ఉన్నారు. అంతవరకూ జిల్లా వాసులకు ఉల్లి కష్టాలు తప్పవు.
 
 రెండురోజుల వరకూ రాకండి
 రైతు బజార్లలో ఓ కుటుంబానికి కేజీ రూ.20 చొప్పున ఇచ్చే 2కేజీల ఉల్లి రెండు, మూడు రోజులకు సరిపోతాయని, ఒకసారి తీసుకున్న వారు రెండు రోజుల వరకూ రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కొక్కరూ నాలుగు నుంచి పది కేజీలు ప్రతి రోజూ తీసుకువెళుతున్నారు. తోపుడు బళ్లపై అల్పాహారం విక్రయించేవారు, హాస్టళ్లు, మెస్‌లు నిర్వహించేవారు ఎక్కువ కేజీల ఉల్లిపాయలు తీసుకుపోతున్నారు. ఒకే రోజు వేరు వేరు కౌంటర్లలో ఉల్లి కొనుగోలు చేసి వాటిని బయట ఎక్కువ రేటుకి విక్రయిస్తున్న వారిని అధికారులు గుర్తించారు. దీనిని పరిష్కరించేందుకంటూ ఉల్లి కావాలంటే ఆధార్, రేషన్ కార్టు తీసుకురావాలని నిబంధన విధించారు. ఒక సారి ఉల్లి తీసుకుంటే ఆధార్ కార్డుపై నెంబర్ వేస్తున్నారు. దానిపైనా వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులతో వాగ్వావాదాలకు దిగుతున్నారు.
 
 ఉల్లి లేక వెళ్లిపోతున్నాం...
 సబ్సిడీపై రైతు బజార్లలో కేజీ రూ.20 చొప్పున విక్రయించడం వరకూ బాగానే ఉంది.  రెండు రోజులుగా ఉల్లిని మార్కెటింగ్ శాఖ దిగుమతి చేయడం లేదని తెలిసింది. రోజూ రైతు బజారుకు వచ్చి నిరాశతో ఇంటికి వెళ్లిపోతున్నా. అధికారులు బహిరంగ మార్కెట్‌లో ఉల్లిధర తగ్గినంతవరకూ సబ్సిడీపై ఉల్లి అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన సరిగ్గా అమలు కావడం లేదు. తక్షణమే స్పందించి ఉల్లిపాయలు అందేలా చూడాలి
 - డి.లలిత, ఎంవీపీకాలనీ(విశాఖ)
 

మరిన్ని వార్తలు