సానియా... ఓ రోల్ మోడల్..!

6 Sep, 2015 09:49 IST|Sakshi
సానియా... ఓ రోల్ మోడల్..!

ఆరేళ్ళ వయసున్న సానియా ఇప్పుడు దేశంలోని పిల్లలందరికీ రోల్ మోడల్ అయ్యింది. గౌరా గ్రామంలోని ప్రతివారూ ఇప్పుడు సానియాను ఫాలో అవుతున్నారు. ఆమెలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆమె మాత్రమే గ్రామం మొత్తానికి హెల్దీ ఛైల్డ్ గా గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్స్ తరపున వాత్సల్య ఎన్జీవో ఆర్గనైజేషన్ జరిపిన సర్వేలో గౌరా గ్రామంలో సానియా కుటుంబం తప్పించి మరెవ్వరూ పూర్తి ఆరోగ్యంతో లేనట్లు గుర్తించారు. ఈ ఆరేళ్ళ చిన్నారి ఆరోగ్యం దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నలక్షలమంది  పిల్లలకు, వారి కుటుంబాలకు  మార్గ దర్శకమైంది. ఓ ఆరోగ్యవంతమైన బిడ్డ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగల్గుతుంది అనేందుకు సానియా నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మన జీవితాలను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతాయన్నందుకు సానియా లైఫ్ స్టైల్ ను ఉదాహరణగా చెప్పొచ్చు.

ఉత్తర ప్రదేశ్ లో ని గౌరా గ్రామంలో ఒకే ఒక్క  హెల్దీ ఛైల్డ్ గా సానియా గుర్తింపు పొందింది. మంచి ఆహారపు అలవాట్లు  ఉన్న కుటుంబంతోపాటు, తల్లిదండ్రులు పాటించిన ఫ్యామిలీ ప్లానింగ్ ఆమెకు వరంగా మారింది. ఎక్కువశాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్న గౌరా గ్రామంలో ఓ ఎన్జీవో సంస్థ జరిపిన సర్వేలో ఈ నిజం వెలుగు చూసింది.  ఇంటి చుట్టుపక్కలవారు, స్నేహితుల్లోనే కాక ఏకంగా గ్రామంలోనే ఆ ఆరేళ్ళ చిన్నారి ఆరోగ్యంలో ముందున్నట్లుగా ఆ సంస్థ వెల్లడించింది.

సానియా త్రండి కుండలు తయారు చేయడం వృత్తిగా జీవనం సాగిస్తున్నాడు. అయితేనేం సానియా ఆరోగ్యంలో ముందుండేందుకు ఆమె కుటుంబ ఆహారపు అలవాట్లు ఎంతగానో సహకరించాయి. కేవలం శారీరకంగానే కాదు... మానసికంగా కూడ సానియా ఎంతో ఆరోగ్యంవంతంగా ఉంది. అతి చిన్న గ్రామంలో ఉంటున్నా సానియా కుటుంబం ఎంతో పరిశుభ్రతను పాటిస్తుంది. భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం వారి కుటుంబాన్ని అనారోగ్యాలకు దూరంగా ఉంచగల్గుతోందని ఆ సంస్థ సర్వేలో తేల్చి చెప్పింది. ఇప్పటికీ దేశంలోని పలు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడ కొందరు మహిళలు ప్రసవం ఇంట్లోనే చేసుకుంటున్నారు. గర్భంతో ఉన్నప్పుడు కూడ కనీసం వైద్యులను సంప్రదించి అవసరమైన సలహాలను, వైద్యాన్ని తీసుకోవడం లేదు. కానీ ఓ చిన్న  గ్రామంలో ఉన్నా... సానియా తల్లి మాత్రం గర్భంతో ఉన్నప్పుడు  ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్ చేయించుకోవడం, అవసరమైన పోషకాహారాన్ని, ఐరన్ మాత్రలను వాడటంతో ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డను కనగలిగింది. పసిబిడ్డల పెంపకంలో ఎంతో కష్టమైన మొదటి ఆరు నెలలు దాటే వరకూ తల్లిపాలివ్వడం సానియా ఆరోగ్యానికి కలసి వచ్చింది. అంతేకాదు తల్లిదండ్రులు బిడ్డ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు.  ఎప్పటికప్పుడు క్రమంగా వాక్సిన్లు వేయించారు. తమ ఆర్థిక స్థితిగతులను బట్టి మరో బిడ్డను ఆరోగ్యంగా పెంచడం కష్టమని తెలుసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ కూడ పాటించారు. ఇవన్నీ సానియాను నేడు ఆరోగ్యానికి ఓ రోల్ మోడల్ గా నిలబెట్టాయి.  
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు