మీ వల్లే ఆమె జైలులో ఉంది

14 May, 2017 10:27 IST|Sakshi
మీ వల్లే ఆమె జైలులో ఉంది

ఆప్‌ నేత ఆశిష్‌ ఖేతన్‌కు బెదిరింపు లేఖ

న్యూఢిల్లీ: కొన్ని హిందూ అనుంబంధ సంస్థలు తనను చంపుతామని బెదిరించినట్లు ఆప్‌ నాయకుడు ఆశిష్‌ ఖేతన్‌ శనివారం ఆరోపించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజుజును డిమాండ్‌ చేశారు. హిందూ సాధువులపై పాపాలు చేయడంలో అన్ని పరిమితులు దాటారని పేర్కొంటూ మే 9న ఓ లేఖ ఆయనకు చేరింది.

‘మీ వల్లే.. సాధ్వి ప్రగ్యా(మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలు), వీరేంద్ర సింగ్‌(హేతువాది దబోల్కర్‌ హత్య కేసులో నిందితుడు) జైలులో ఉన్నారు. మీలాంటి వాళ్లకు ఉరిశిక్షే సరి’ అని లేఖలో రాసి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దీనిపై స్పందిస్తూ... ఇది తనను షాక్‌కు గురిచేసిందని, హోం మంత్రి రాజ్‌నాథ్‌ చర్యలు తీసుకోవాలని కోరారు.

మాజీ జర్నలిస్టు అయిన ఆశిష్‌ ఖేతన్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ నియోజక వర్గం పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది కూడా ఆయనకు ఇదే విధంగా బెదిరింపు లేఖ వచ్చింది. జర్నలిస్టులు, రచయితలు, హక్కుల కార్యకర్తలకు అతివాదుల నుంచి ముప్పు పొంచివుందని ఖేతన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు